తొందరపాటే టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ కొంపముంచుతుందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్(Krish Srikanth) అన్నాడు. కాస్త సమయం తీసుకోని పెద్ద షాట్స్ ఆడాలని సూచించాడు. క్రీజులో సెట్ అయ్యేవరకు మరో ఓపెనర్ అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇవ్వాలని సలహా ఇచ్చాడు.
న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో సంజూ శాంసన్(10, 6) తీవ్రంగా నిరాశపర్చాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో చెత్త షాట్స్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కృష్ణమాచారి శ్రీకాంత్.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో సంజూ శాంసన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొందని తెలిపాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో సంజూ శాంసన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.

తిలక్ వర్మ జట్టులోకి తిరిగి వస్తే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుందని శ్రీకాంత్ తెలిపాడు. 'తిలక్ వర్మ జట్టులోకి వస్తే.. ఎవరిని పక్కన పెడతారు? సంజూ శాంసన్‌ను బయటకు పంపిస్తారా? అతను చాలా ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. రెండో టీ20లో ఇన్నింగ్స్ రెండో బంతికే అతను ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ మరో రెండు బంతుల వ్యవధిలోనే చెత్త షాట్ ఆడి వెనుదిరిగాడు.
అతను కాస్త జాగ్రత్తగా ఆడాల్సింది. సింగిల్స్ తీసి అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇవ్వాల్సింది. అలా చేయకుండా ఎదురుదాడికి దిగడం తప్పు. ఇలాంటి సమయాల్లో స్ట్రైక్ రొటేట్ చేసి.. లయను తిరిగి పొందాలి. కానీ సంజూ తొందరపడ్డాడు. ఇషాన్ కిషన్ మాత్రం గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దాంతో అతనిపై ఒత్తిడి పెరుగుతుంది. జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో మూడో టీ20లో సంజూ శాంసన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి అండగా నిలిస్తే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. అయితే అతను ఈ మ్యాచ్‌లో రాణించాల్సి ఉంటుంది.