ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్‌గా బదానీ ఏం సాధించాడని ఇతర కోచ్‌లను విమర్శించాడని ప్రశ్నించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్‌పై బదానీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 75 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. హెడ్ కోచ్ హేమాంగ్ బదానిపై మండిపడ్డాడు. ఇతరులను విమర్శించే ముందే తన పని తాను చూసుకోవాలని చురకలంటించాడు.
'హేమాంగ్ బదాని.. ఇతరుల గురించి మాట్లాడే ముందు నీ పని నువ్వు సరిగ్గా చేయ్. జీవితంలో ఎక్కువగా మాట్లాడకూడదు. నువ్వు ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇప్పుడు నీ జట్టు పరిస్థితి చూసి మౌనంగా ఉండు. నువ్వు ఎవరివి? స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి మాట్లాడటానికి నీకేముంది? నువ్వు కోచ్‌గా ఏం సాధించావు? 'అని శ్రీకాంత్ సూటిగా ప్రశ్నించాడు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్‌పై హేమాంగ్ బదాని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ధోనీ లేకపోతే కోచ్‌గా ఫ్లెమింగ్ రాణించలేడని చెప్పాడు. ఫ్లెమింగ్ సక్సెస్ పూర్తిగా ఎంఎస్ ధోనీ మీద ఆధారపడి ఉందని చెప్పాడు. ఐపీఎల్ తప్ప వేరే ఏ టోర్నీలో కోచ్‌గా అతను రాణించింది ఏం లేదని విమర్శించాడు. ఢిల్లీ వరుస పరాజయాల నేపథ్యంలో బదాని వ్యాఖ్యలను గుర్తు చేస్తూ క్రిష్ శ్రీకాంత్ గట్టిగా అర్సుకున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్‌పై 264 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయిన ఢిల్లీ.. ఆర్‌సీబీ చేతిలో 75 పరుగులకే కుప్పకూలింది. ఒకానొక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసేలా కనిపించింది. కానీ అభిషేక్ పోరెల్ పోరాటం వల్ల ఆ ఘోర అవమానాన్ని తప్పించుకుంది.
హెడ్ కోచ్ బదాని అనాలోచిత నిర్ణయాల వల్లే ఢిల్లీకి వరుస ఓటములని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పృథ్వీ షా వంటి అనుభవం కలిగిన ఆటగాడు ఉండగా.. 18 ఏళ్ల సాహిల్ పరీఖ్‌ను ఓపెనర్‌గా పంపాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. 8 మ్యాచ్‌ల్లో ఐదు ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.