
చెన్నై: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ సై అంటుంటే.. ఎన్నో ప్రతికూలతల మధ్య భారత్ బరిలోకి దిగుతోంది. ఫస్ట్ టెస్ట్‌లో భారత్‌పై విజయం సాధించినా.. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉందని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. రెండో టెస్ట్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బలమైన బౌలింగ్ లైనప్‌తో ఆసీస్ ఫస్ట్ టెస్ట్‌లో విజయం సాధించిందన్నాడు. వారి బ్యాటింగ్ లైనప్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపైనే ఆధారపడి ఉందని, స్మిత్, డేవిడ్ వార్నర్ 30 శాతం చొప్పున రాణిస్తే.. మిగతావారంత మరో 30 శాతం ప్రభావం చూపుతారని పేర్కొన్నాడు.'ఆస్ట్రేలియా బ్యాటింగ్ అంత గొప్పగా లేదనే విషయాన్ని మరవద్దు. నా అభిప్రాయంప్రకారం ఆసీస్ బ్యాటింగ్‌లో వార్నర్ 30 శాతం, స్మిత్ 30 శాతం రాణిస్తే మిగతావారంతా మరో 30 శాతం పరుగులు చేస్తారు. కానీ వారి బౌలింగ్ చాలా బాగుంది.'అని తెలిపాడు.

ఇక పోరాడాలనే కసిలేకనే ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా దారుణంగా విఫలమైందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ కారణంతోనే 36 పరుగులకే పరిమితమై పరువు తీసుకుందున్నాడు. అయితే ఈ క్లిష్ట పరిస్థితిల్లో నుంచి బయటపడటం టీమిండియాకు పెద్ద కష్టమేమి కాదని, కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా విజయాల బాట పట్టించవచ్చన్నాడు. 'ఫస్ట్ టెస్ట్ ఓటమి అనంతరమే ఆటగాళ్లలో సానుకూల దృక్పథం లోపించిందని చెప్పాడు.
అదే భారత దారుణ ఓటమికి దారితీసింది. అయితే ఈ క్లిష్ట పరిస్థితి నుంచి పుంజుకోవడం జట్టుకు పెద్ద కష్టమేమి కాదు. సానుకూల దృక్పథంతో రాణిస్తే సులువుగా ఆసీస్‌పై విజయం సాధించవచ్చు. కీలక ప్లేయర్ అయిన విరాట్ దూరమైనా సమష్టిగా రాణిస్తే విజయం దక్కుతుంది.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.