మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల జల్లుతో పాటు భారీ నజరానా కురుస్తోంది. తెలుగు తేజం శ్రీ చరణికి అయితే రూ.2.5 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్‌తో పాటు 1000 గజాల నివాస స్థలం, గ్రూప్-1 ఉద్యోగం దక్కింది. ప్రపంచ వేదికలపై విజయం సాధించినప్పుడు అందులో భాగమైన క్రీడాకారులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం సర్వసాధారణమే. కానీ టీమిండియా పేసర్ క్రాంతి గౌడ్ విజయంతో ఆమె తండ్రి మున్నా సింగ్‌కు ఉద్యోగం దక్కింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో క్రాంతి గౌడ్ ప్రధాన పేసర్. మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బర్త్‌రఫ్ అయిన క్రాంతి తండ్రి మున్నాసింగ్ గౌడ్‌ను పోలీసుగా పునర్నియమిస్తామని మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో క్రాంతి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన క్రాంతి.. కుటుంబ గౌరవాన్ని కాపాడినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

2012లో ఎన్నికల విధులు నిర్వర్తించడంలో చేసిన ఒక పొరపాటు కారణంగా కానిస్టేబుల్ మున్నా సింగ్ గౌడ్‌పై వేటు పడింది. అయితే అతను ఏం తప్పిదం చేశాడనే విషయంపై క్లారిటీ లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవడం వల్ల క్రాంతి గౌడ్ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. కొన్నిసార్లు తిండికి కూడా చాలా కష్టంగా ఉండేదని క్రాంతి పలు ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. అయినా క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించిన ఆమె భారత జట్టులో చోటు సంపాదించి..కుటుంబానికి అండగా నిలిచింది. తండ్రిని తిరిగి పోలీసుగా చూసుకోవాలనుకున్నానని, గౌరవంగా రిటైర్ కావాలని కోరుకున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చింది. తాజా విజయంతో ఆమె కోరిక నెరవేరింది.
రైట్ ఆర్మ్ మీడియం-ఫాస్ట్ బౌలర్ అయిన క్రాంతి గౌడ్.. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో 8 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీసింది. ముఖ్యంగా కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది. పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో క్రాంతి గౌడ్(3/20) మూడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకుంది. న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కూడా ఆమె 2 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో డేంజరస్ బ్యాటర్ అలీస్సా హీలీని త్వరగా పెవిలియన్ చేర్చింది.