KKR Probable Squad For IPL 2022: కోల్‌కతాలోకి శ్రేయస్ అయ్యర్, షారూఖ్ ఖాన్.. పూర్తి జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే టోర్నీలో రెండు సార్లు టైటిల్ గెలిచి.. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా ఈసారి టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన టీమ్‌ను తయారు చేసుకోవాలనుకుంటుంది.
రిటెన్షన్ ప్రక్రియలో విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్(రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తీ(రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను తీసుకున్న కోల్‌కతా రూ.34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.56 కోట్లు ఉన్నాయి. మిగతా జట్లతో పోలిస్తే కేకేఆర్ దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి.
మంచి ఆటగాళ్ల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆ జట్టుది సత్తా కలిగిన కెప్టెన్ ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కెప్టెన్ స్లాట్ కోసం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్‌లను టార్గెట్ చేయాలనుకుంటుంది. మెగా వేలంలో కోల్‌కతా కొనుగోలు చేయాలనుకుంటున్న ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా డికాక్, క్రిస్ లిన్, ధావన్, వార్నర్..
గత సీజన్ సెకండాఫ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్‌కు జతగా ఓపెనింగ్ స్లాట్ కోసం క్వింటన్ డికాక్, క్రిస్ లిన్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌లపై కేకేఆర్ కన్నేసింది. వీరిలో ఏ ఒక్కరినైనా దక్కించుకోవాలనుకుంటుంది. అయితే వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండర్‌గా, ఫినిషర్ రోల్‌లో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్న నేపథ్యంలో కేకేఆర్ కూడా అతన్ని లోయరార్డర్‌లో ఆడించాలనుకుంటే మాత్రం ఇద్దరు ఓపెనర్లను తీసుకోవాల్సి ఉంటుంది.
అప్పుడు ఈ నలుగురి ఆటగాళ్లలో ఇద్దరినైనా లేకుంటే ఓ దేశవాళీ ఓపెనర్‌ను అయిన కేకేఆర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. క్రిస్ లిన్ గతంలో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. డికాక్, ధావన్, వార్నర్‌లకు భారీ పోటీ ఉండగా.. లిన్ కేకేఆర్‌కు దక్కే చాన్సుంది. డికాక్ చిక్కితే వికెట్ కీపర్ సమస్య కూడా కేకేఆర్‌కు తీరనుంది. జాసన్ రాయ్‌ను తీసుకునేందుకు కూడా కేకేఆర్ ఆసక్తి కనబరుస్తోంది.

మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్
మిడిలార్డర్‌లో ఆడటంతో పాటు టీమ్ నడిపించే సత్తా ఉన్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై కేకేఆర్ టార్గెట్ చేసింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కోసం ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్దంగా ఉంది. అయ్యర్‌ను తీసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ ఇతర జట్లకు వెళ్లే అవకాశం ఉంది. తమ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తక్కువ ధరకు అందుబాటులో ఉంటే మళ్లీ అతన్ని తీసుకునే చాన్సుంది. రాహుల్ త్రిపాఠి, షారూఖ్ ఖాన్‌లను కూడా తీసుకోవాలని కేకేఆర్ భావిస్తోంది.

స్పిన్నర్లుగా అశ్విన్, చావ్లా..
ఇక ఆల్‌రౌండర్లుగా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లు ఉన్న నేపథ్యంలో కేకేఆర్.. వారికి బ్యాకప్ ఆప్షన్స్‌పై దృష్టిసారించనుంది. ఈ స్లాట్ కోసం పెద్దగా ఖర్చుపెట్టే అవకాశం లేదు. బెన్ కట్టింగ్ వంటి లో కాస్ట్ ప్లేయర్లతో పాటు దేశవాళీ ఆల్‌రౌండర్లను తీసుకునే చాన్సుంది. స్పిన్నర్లకు కూడా కేకేఆర్ పెద్దగా ఖర్చు పెట్టే చాన్స్ లేదు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ రూపంలో జట్టుకు కావాల్సిన ఇద్దరూ క్వాలిటీ స్పిన్నర్లున్నారు. వారికి బ్యాకప్‌గా అశ్విన్, చావ్లాలను తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. తక్కువ ధరకు అందుబాటులో ఉంటేనే తీసుకునే చాన్స్ ఉంది.

పేసర్లుగా రబడా, షమీ, ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫెర్గూసన్..
ఇక పేసర్లుగా కగిసో రబడా, మహమ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ టార్గెట్ చేసింది. కానీ వీళ్లంతా భారీ ధర పలికే చాన్సుంది. భారీ డబ్బుతో మహమ్మద్ షమీని కొనుగోలు చేస్తే.. అతనికి తోడుగా జోష్ హెజల్ వుడ్, మార్కో జాన్సెన్ వంటి తక్కువ రేటేడ్ బౌలర్లను కేకేఆర్ తీసుకోవచ్చు. దేశవాళీ స్టార్లు శివం మావి, చేతన్ సకారియాలపై కూడా ఓ కన్నేసింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్(అంచనా)
జాసన్ రాయ్/క్వింటన్ డికాక్, క్రిస్ లిన్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శ్రేయస్ అయ్యర్, షారూఖ్ ఖాన్, ఆండ్రీ రస్సెల్, రిషి ధావన్, సునీల్ నరైన్, జోష్ హజెల్ వుడ్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తీ, ఓడీన్ స్మిత్, రజత్ పటిదార్, కరుణ్ నాయర్, ఆకాశ్ దీప్ సింగ్, సిద్దార్థ్ యాదవ్, ఆడమ్ మిల్నే, అంకుల్ రాయ్, మార్కో జాన్సెన్, జయంత్ యాదవ్, వైభవ్ అరోరా, మాథ్యూ వేడ్, మనన్ వోహ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications