హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పించాడని భావించిన విరాట్ కోహ్లీ.. కనీసం గంగూలీ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. మరోవైపు బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడానికి కోహ్లీ కూడా కారణమని భావించిన గంగూలీ కూడా అతనివైపు కన్నెత్తి చూడలేదు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా సౌరవ్ గంగూలీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. కోహ్లీ ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోగా.. కోహ్లీ, గంగూలీ ఎడ మొహం పెడ మొహంగా ప్రవర్తించారు. కోహ్లీ దగ్గరకు రాగానే గంగూలీ దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత డగౌట్‌లో కోహ్లీ కాలు మీదు కాలు వేసుకొని గంగూలీ వైపు ఆగ్రహంగా చూడగా.. దాదా కూడా అదే రీతిలో సీరియస్‌గా చూస్తూ ముందుకెళ్లాడు.
కోహ్లీ, గంగూలీ ప్రవర్తన గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుండగానే.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌరవ్ గంగూలీని కోహ్లీ అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆర్‌సీబీ-డీసీ మ్యాచ్ ముందు వరకు విరాట్ కోహ్లీ ఫాలోఅవుతున్న సంఖ్య 277 మంది ఉండగా.. మ్యాచ్ తర్వాత 276కు పడిపోయింది. అన్‌ఫాలో చేశాడని గమనించిన అభిమానులకు విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ లిస్టులో గంగూలీ పేరు లేకపోవడం కనిపించింది.
ఇద్దరు మాజీ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడాన్ని క్రికెట్ అభిమానులు సహించలేకపోతున్నారు. ఎంతో మంది ఆదర్శంగా భావించే ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం సరికాదని, సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నారని మండిపడుతున్నారు.