
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. కెప్టెన్‌గా తన ప్రయాణంలో సహకరించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. సన్నిహితులు, లీడర్‌షిప్ గ్రూప్‌లోని కీలక సభ్యులైన హెడ్ కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నాడు.
కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోహ్లీ తొందరపడ్డారని అంటుంటే.. మరికొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం.. అతనిలోని బ్యాట్స్‌మెన్‌కు మేలు చేస్తుందని అంటున్నారు. అయితే టీ20ల్లో కెప్టెన్‌గా కోహ్లీకి ఘనమైన రికార్డు ఉందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. కోహ్లీ సారథ్యంలో భారత్ 45 టీ20 మ్యాచ్‌లు ఆడి 27 గెలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఓడగా.. విజయాల శాతం 65.11గా ఉంది. సారథిగా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో కోహ్లీ 1502 పరుగులు చేశాడు.
కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టీ20ల్లో ఆస్ట్రేలియా(2020), ఇంగ్లండ్(2018), సౌతాఫ్రికా(2018), న్యూజిలాండ్ (2020), వెస్టిండీస్(2019), శ్రీలంక(2017)పై సిరీస్ విజయాలు సాధించింది. గత 10 టీ20 సిరీస్‌ల్లో 9 సిరీస్‌లను కైవసం చేసుకుంది. అత్యధిక విజయాలు సాధించిన టీ20 కెప్టెన్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. అస్గర్ అఫ్గాన్ 80.77 శాతంతో టాప్‌లో ఉండగా.. కోహ్లీ 64.44 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్, ఇయాన్ మోర్గాన్, డారెన్ సామీ, మహేంద్ర సింగ్ ధోనీలున్నారు.
టెస్టులో కోహ్లీ 65 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో టీమిండియా 38 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక కెప్టెన్‌గా ఆడిన 65 మ్యాచ్‌ల్లో 5667 పరుగులు చేశాడు. 20 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో విరాట్ 95 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అందులో భారత్ 65 మ్యాచ్‌లను గెలిచింది. ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. కెప్టెన్‌గా ఆడిన 95 మ్యాచ్‌ల్లో కోహ్లీ 5449 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు ఉన్నాయి.