చెన్నై: సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడటం.. టైటిల్ గెలవడం తన జీవిత లక్ష్యమని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన కలని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆదివాం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ అందుకున్నాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జట్టుకు దూరమైనప్పుడు తీవ్ర బాధను భరించినట్లు చెప్పుకొచ్చాడు.

'ఒకానొక సమయంలో నేను తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాను. అద్భుత ప్రదర్శన ఇచ్చినా కూడా జనాలు నన్ను విమర్శించారు. తిట్టని తిట్లు తిట్టారు. ఆ సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. అనంతరం ఐపీఎల్‌లో గాయపడి జట్టుకు దూరమయ్యాను. నేను పూర్తిగా కోలుకునేందుకు 5-6 నెలల సమయం పట్టింది. ఈ సమయంలో తీవ్ర బాధతో పాటు నొప్పిని అనుభవించాను.
రికవరీ దశలో రోజు ఒకటే అనుకునేవాడిని. నిద్రలేచిన వెంటనే ఈ సారి నేను బాగా ఆడి భారత్‌కు ప్రపంచకప్ అందివ్వాలి. ఈ విపత్కర కాలంలో నన్ను మోటివేట్ చేసింది ఇదొక్కటే. సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడటం.. టైటిల్ గెలవడం నా కల.. జీవిత లక్ష్యం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్‌పై స్పందించిన రాహుల్.. కోహ్లీ సహకారంతోనే రాణించానని చెప్పాడు. '2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చినప్పుడు నేను, కోహ్లీ పెద్దగా మాట్లాడుకోలేదు. వికెట్ కీపింగ్ చేసిన తర్వాత స్నానం చేసి రెస్ట్ తీసుకుందామని అనుకున్నా. కానీ నాకు ఆ టైమ్ కూడా దొరకలేదు.
పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని, టెస్ట్ తరహా బ్యాటింగ్ చేయాలని కోహ్లీ సూచించాడు. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ డ్యూ వచ్చి బ్యాటింగ్‌కు ఈజీ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఓపికగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు. నేను అదే ఫాలో అయ్యాను. కోహ్లీ చెప్పినట్లే మంచు ప్రభావం ఉండటంతో బ్యాటింగ్‌కు ఈజీ అయ్యింది. ఈ పిచ్ మంచి క్రికెట్ వికెట్. బౌలర్లు, బ్యాటర్లకు సమంగా ఉంది.'అని రాహుల్ తెలిపాడు.