
లండన్: ఇన్నాళ్లు టెస్ట్ క్రికెట్‌కు దూరమైనందుకు సంతోషంగానే ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. జట్టులో చోటు కోల్పోవడం వల్లే తన తప్పిదాలేంటో తెలిసాయని, ఆటగాడిగా మరింత మెరుగయ్యేందుకు అవకాశం దొరికిందన్నాడు. గత 18 నెలలుగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్.. ఆగష్టు 4 నుంచి ఇంగ్లండ్ ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరచి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న రాహుల్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే కౌంటీ ఎలెవన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.
ఈ సుదీర్ఘ సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐ టీవీతో రాహుల్ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదురైన పలు సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరు గురించి చెప్పుకొచ్చాడు. '2018లో జట్టులో స్థానం కోల్పోయా. ఆ సమయంలో నా వైఫల్యాలకు గల కారణాల గురించి కోచ్‌లతో చర్చించా. నేను ఎక్కడ తడబడుతున్నాననే విషయాలను తెలుసుకోవడానికి నా ఆటకు సంబంధించిన చాలా వీడియోలను చూసి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశా. అప్పుడు నేను టెస్టు క్రికెట్‌కు దూరమైనందుకు సంతోషంగానే ఉన్నా.
ఎందుకంటే అది నా ఆటలోని తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడింది. వైఫల్యాలు అనేవి మనల్ని మరింత బలవంతులుగా మార్చుతాయి. ఆటపై మరింత దృష్టిపెట్టే విధంగా చేస్తాయి. నా విషయంలోనూ అదే జరిగింది. ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. నేను నా ఆటను ఎంజాయ్ చేస్తా. తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం నాకిష్టం. మరోసారి నాకు మంచి అవకాశం వచ్చింది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషిస్తా' అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా నెట్స్‌లో చెమటోడుస్తుంది. ఇప్పటికే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన జట్టు రేపటి నుంచి మరో మ్యాచ్ ఆడనుంది.