
పరిస్థితులకు తగ్గట్లు షాట్స్..
మూడో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ తనలో వచ్చిన మార్పుకు గల కారణాన్ని వెల్లడించాడు.'బ్యాటింగ్ చేసేటప్పుడు నా మదిలో చాలా ఆలోచనలు ఉంటాయి. టెస్ట్ క్రికెట్లో ప్రతి బంతిని ఎదుర్కోనేందుకు నేను రెండు, మూడు రకాల షాట్లు ఉపయోగిస్తాను. పరిస్థితులకు తగ్గట్లు ఏ షాట్ ఆడాలనేది ఎంచుకుంటాను. గత పర్యటన వైఫల్యం తర్వాత నేను తెలుసుకున్నది ఇదే. మంచి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు, బంతి స్వింగ్ అయినప్పుడు భిన్నమైన షాట్లు ఆడగలగాలి. గత పర్యటన(2018)లో విఫలమైన్నప్పటి నుంచి షాట్ల ఎంపికపై బాగా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాను.

బెంచ్‌పై కూర్చున్నా..
మైదానం బయట కూర్చునేటప్పుడు కూడా లోపల బాగా ఆడే బ్యాట్స్‌మెన్ ఆటను గమనిస్తూ మెలకువలు నేర్చుకుంటున్నాను. ఏ ఫార్మాటైనా షాట్లు ఎంపిక అనేది చాలా ముఖ్యం. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జట్టుకు మంచి స్కోర్‌ను అందించాను. టీమ్ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం. టీమ్ మేనేజ్మెంట్ ఏ స్థానంలో ఆడమన్నా అడేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇంగ్లండ్‌లో ఆడటం సవాల్ లాంటిది. వారిది ప్రపంచస్థాయి బౌలింగ్. ముఖ్యంగా అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఎన్నో నైపుణ్యాలున్న బౌలర్లు. ఇద్దరూ ఇప్పటికే 600 వికెట్ల మార్క్‌ను ధాటేసారు. వారి బౌలింగ్ ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్న పనే.

నాకు భలే ఇష్టం..
భిన్నమైన వాతావరణం కలిగిన ఇంగ్లండ్‌లో ఆడేందుకు నేనెప్పుడు ఇష్టపడుతాను. ఇక ఈ టెస్ట్ వికెట్ బాగుంది. ఆడటానికి కష్టమవుతుందని చెప్పడం లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అండర్సన్, బ్రాడ్ వంటి బౌలర్లను ఎదుర్కోవడాన్ని మరే బ్యాట్స్‌మన్‌కు నచ్చకపోయినా నేను మాత్రం ఇష్టపడుతా. జట్టులో ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్దం. గత రెండేళ్లుగా నేను నేర్చుకుంది ఇదే. గతంలో నన్ను డబుల్ రోల్ పోషించమన్నారు. నేను సంతోషంగా ఆ బాధ్యతలు నిర్వర్తించాను. ఇప్పుడు ఓపెనర్‌గా నాకు దక్కిన మరో అవకాశం ఇది. దాన్ని సాధ్యమైనంత వరకు అందిపుచ్చుకుంటాను'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

రాణించిన జడేజా..
ఓవర్‌నైట్ స్కోరు 125/4తో మూడో రోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 278 వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (84) మరో 27 రన్స్ జోడించగా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (86 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బుమ్రా 28, పంత్ 25 పరుగులు చేశారు. రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి 25/0 స్కోరు చేసింది. వర్షం కారణంగా చివరి సెషన్ రద్దు చేశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 స్కోరు వద్ద ఆలౌటైంది.


Click it and Unblock the Notifications
