
దుబాయ్: రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. గతంలో చేసిన తప్పిదాలే మళ్లీ రిపీట్ చేశామని, అవే తమ ఓటమిని శాసించాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయలేక చేతులెత్తేసింది. కార్తీక్ త్యాగీ సూపర్ బౌలింగ్ ముందు తేలిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన రాహుల్.. ముందుగానే మ్యాచ్ ముగించాల్సిందన్నాడు.
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గతంలోనూ ఇదే తరహాలో మేం ఓటమిపాలయ్యాం. కాబట్టి.. ఒత్తిడిని అధిగమించడం నేర్చుకుని ఉండాల్సింది. ఈ మ్యాచ్‌ను 18 ఓవర్‌లోనే ముగించి ఉంటే బాగుండేది. పాత తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకోలేదు. కనీసం తర్వాత ఐదు మ్యాచ్‌ల్లోనైనా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. బౌలింగ్‌లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. వరుసగా వికెట్లు తీయడం ఈ ఫార్మాట్‌లో చాలా ముఖ్యం. నాతో సహా మయాంక్, అరంగేట్ర ప్లేయర్ ఎయిడెన్ మార్క్‌రమన్ పరుగులు చేయడం మాకు కలిసొచ్చే అంశమే. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించినప్పటికీ చివరి ఓవర్‌లో ఎడ్జ్ అయిన రెండు బంతులు మా విజయాన్ని లాక్కెళ్లాయి.' అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (5/32) ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. అనంతరం చేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ రాహుల్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 67)రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అవ్వగా.. ఆఖరి ఓవర్‌లో కార్తీక్ త్యాగి అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు ఒకే ఒక పరుగు ఇచ్చాడు.