టెస్ట్ క్రికెట్ మనుగడపై వస్తున్న ప్రశ్నలకు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్ సరైన సమాధానమని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ 2-2తో సమమైనప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 339/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 367 పరుగులకు ఆలౌటైంది.
మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయమైన వియాజయాన్నందించాడు. సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కేఎల్ రాహుల్.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతని సారథ్యంలో టీమిండియా గొప్ప విజయాలు సాధిస్తుందని చెప్పాడు.

'టెస్ట్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల కంటే ముఖ్యమైనది. నేను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. మేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అంతకుముందు భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచింది. ప్రపంచకప్ ముందు ఏ టోర్నీ సాటి రాదు. కానీ ఈ మ్యాచ్ ఇచ్చిన మజా నాకు ఏదీ ఇవ్వలేదు.
టెస్ట్ క్రికెట్ మనుగడపై వస్తున్న ప్రశ్నలకు ఈ సిరీస్ సమాధానమని నేను భావిస్తున్నాను. ఈ సిరీస్‌లో రెండు జట్లు తలపడిన తీరు చూస్తే.. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుందనే నమ్మకం కలుగుతోంది. ఈ సిరీస్ మేం అద్భుతంగా పోరాడి సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్నాం. ఇది అందరికి డ్రా అనిపించవచ్చు. కానీ చరిత్రలో నిలిచిపోయే ఈ సిరీస్.
భారత టెస్ట్ క్రికెట్‌లో ఈ సిరీస్‌తోనే నయా శకం మొదలైంది. ఈ జట్టు విదేశీ గడ్డపై కూడా సిరీస్‌లు గెలుస్తుంది. నేను జట్టులో చేరగానే సీనియర్లు విరాట్, రోహిత్, అశ్విన్ లేరనే విషయం అర్థమైంది. నా పక్కన వారు లేకపోవడం వింతగా అనిపించింది. మ్యాచ్‌ల సందర్భంగా ప్రతీ ఒక్కరు నా దగ్గరకు ఇంగ్లండ్ కండిషన్స్ గురించి అడిగారు. అప్పుడే నాకు జట్టులో నేను ఓ సీనియర్ ఆటగాడిగా.. వేరే పాత్రలో అడుగుపెట్టాననే విషయం అర్థమైంది.
కుర్రాళ్లకు నా అనుభవాన్ని ఉపయోగించి సూచనలు చేశాను. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కుర్రాళ్లతో జట్టు విజయం కోసం చాలా కష్టపడ్డాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. అతను మార్పులు చేసినప్పుడల్లా జట్టుకు వికెట్లు దక్కాయి. కెప్టెన్‌గా అతను మరింత ఎదుగుతాడు. టీమిండియా కెప్టెన్‌గా జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు అతను సరైనోడు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.