టీమ్ కోసం ఆ త్యాగానికి సిద్దం.. గెలవడమే మా లక్ష్యం: కేఎల్ రాహుల్

నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ మేనేజ్‌మెంట్ కోరితే తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసుందుకైనా తాను సిద్దంగా ఉన్నానని టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. జట్టు అవసరం కోసం మిడిలార్డర్‌లోనైనా బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఈ సిరీస్ గెలవడం తమకు చాలా ముఖ్యమని, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరడమే తమ లక్ష్యమని రాహుల్ స్పష్టం చేశాడు. నాగ్‌పూర్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కనీసం రెండు విజయాలు సాధిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కుతోంది. ఈ క్రమంలోనే విజయం కోసం ముమ్మర సాధన చేస్తోంది.

మిడిలార్డర్‌లో ఆడేందుకు రెడీ..
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సెంచరీల మోత మోగించిన శుభ్‌మన్ గిల్‌నే ఓపెనర్‌గా ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు సూచించారు. ఇక తొలి టెస్ట్ నేపథ్యంలో మంగళవారం కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడాడు. తుది జట్టు ఎంపికతో పాటు తన బ్యాటింగ్ పొజిషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇంకా తొలి టెస్టు ఆడే తుది జట్టును నిర్ణయించలేదు. టీమ్‌లో ఇంకా కొన్ని ఖాళీలను పూర్తి చేయాల్సి ఉంది. నేను ఓపెనర్‌గానే రావాలని అనుకోవడం లేదు. జట్టు కోరితే మిడిల్ ఆర్డర్‌లో ఆడడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే..
భారత్‌లో టర్నింగ్ ఉంటాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని మాత్రం అనుకుంటున్నాం. అయితే మ్యాచ్ ప్రారంభ రోజు పిచ్‌ను చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులను తగట్టు బ్యాటింగ్ చేస్తాం. స్వేచ్చగా షాట్లు ఆడే అవకాశం ఉంటే దూకుడుగా ఆడుతాం. లేదంటే రెగ్యులర్ టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ టెంప్లేట్ ఉపయోగిస్తాం. ఒక ప్లాన్‌తో బరిలో దిగి అలాగే ఆడాలని అనుకోవడం లేదు. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత ప్లాన్‌లో మార్పులు చేయాల్సి వచ్చినా చేయడానికి సిద్దంగా ఉంటాం.

అందుకే ముగ్గురు స్పిన్నర్లు..
ఆస్ట్రేలియా టీమ్ ప్రాక్టీస్ గేమ్స్ ఆడటం లేదు. అయితే ప్రాక్టీస్ గేమ్స్ ఆడాలా? వద్దా? అనేది వారి ఇష్టం. వార్మప్ మ్యాచుల వల్ల పెద్దగా ఒరిగేదీ ఏమీ ఉండదని నా అభిప్రాయం. వాళ్ల టీమ్ పటిష్టంగా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేయాలో వాళ్లకు తెలుసు. ఆస్ట్రేలియాలో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఇది మాకు సవాల్‌గా మారవచ్చు. అయితే మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లకు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లపై మంచి రికార్డు ఉంది. వారిని చక్కగా వాడుకుంటాం. ఈ సిరీస్ తప్పకుండా గెలవాలి. అందుకే స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నాం.అందుకే ముగ్గురు స్పిన్నర్లలతో బరిలోకి దిగాలనుకుంటున్నాం'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications