విమర్శకులను సంతోషపరిచేందుకు తాను ఆడనని, కానీ నిర్మాణత్మక విమర్శలను స్వీకరిస్తానని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. తన ఆటను విశ్లేషిస్తూ రాసే కథనాలను చదవడం, చూడటం తనకు అలవాటని చెప్పాడు. ఆమోదయోగ్యమైన విమర్శలు తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతాయని తెలిపాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్‌పై తరుచూ విమర్శలు వస్తాయనే విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023లో అతను ఆడిన స్లో ఇన్నింగ్స్(107 బంతుల్లో 66) టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. దాంతో అభిమానులు, విమర్శకులు రాహుల్‌ను టీమిండియా విలన్ చిత్రకరిస్తూ ఘాటు విమర్శలు చేశారు.
జిడ్డు బ్యాటింగ్ కాదు..
ఆ ఆ ఇన్నింగ్స్ తర్వాత తన ఆటను మెరుగుపరుచుకున్న కేఎల్ రాహుల్.. మిడిల్ ఓవర్లలో వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోనే వన్డేల్లో అతనికి ప్రథమ వికెట్ కీపర్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తన స్లో బ్యాటింగ్‌పై వచ్చే విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అది జిడ్డు బ్యాటింగ్ కాదని, జట్టు కోసం అలా ఆడాల్సి వస్తుందని తెలిపాడు.

నిర్మాణత్మక విమర్శలు అయితే..
'గత కొన్నేళ్లుగా నాపై విమర్శలు వస్తున్నాయి. నా ఆట పై వచ్చే విమర్శనాత్మక కథనాలను చదవడం, చూడటం నాకు అలవాటు. ఆ విమర్శలు సరైనవో లేదో పరిశీలిస్తాను. ఆ విమర్శ సరైనదే అయితే.. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. ఆ విమర్శలను ఫీడ్ బ్యాక్‌గా భావిస్తాను. అయితే విమర్శకుల కోసం నా స్ట్రైక్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నించాను. ఆ పరిస్థితుల్లో జట్టు విజయానికి కావాల్సిందేదో అదే చేస్తాను. ఇలాంటి పరిస్థితులల్లో కొన్నిసార్లు నా నిర్ణయాలు తప్పు కావచ్చు. కొన్ని సార్లు నేను విఫలమవ్వచ్చు. ఆటను అర్థం చేసుకునే విషయంలో తప్పిదం కూడా చేయవచ్చు. ఇదంతా ఆటలో భాగం.
అలా ఆడటం అంత ఈజీ కాదు..
నేను మాత్రం జట్టు విజయం కోసం నా మనసుకు ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. విమర్శలు సరైనవైతే వాటిని నోట్ చేసుకుంటాను. విభిన్నమైన స్థానాల్లో బ్యాటింగ్ చేయడం అంత సులువైన పనికాదు. కానీ ఆట అలా సాగుతోంది. బ్యాటింగ్ పొజిషన్ టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది. బెస్ట్ కాంబినేషన్ ఏదో జట్టు ఆలోచిస్తుంది. కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఓ ఆటగాడిగా మన బాధ్యతను నిర్వర్తించేందుకు ప్రయత్నించాలి. నేను అదే చేస్తున్నాను.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.