న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఉత్కంఠగా మారినా కేఎల్ రాహుల్ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను తనదైన శైలిలో ముగించాడు. ఈ గెలుపుతో ఈ ఏడాదిని టీమిండియా ఘనంగా మొదలుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. శుభ్‌మన్ గిల్(71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హర్షిత్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), కేఎల్ రాహుల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(4/41) నాలుగు వికెట్లు తీయగా.. ఆదిత్య అశోక్, క్రిస్టన్ క్లార్క్ తలో వికెట్ తీసారు.
భారీ లక్ష్యచేధనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ(26)ను జెమీసన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యమే నమోదైంది. క్రీజులోకి వచ్చిన కోహ్లీ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 48 పరుగులే చేసింది. గిల్‌తో కలిసి విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ ఆదిత్య అశోక్‌ను కోహ్లీ, గిల్ చితక్కొట్టారు. ఈ క్రమంలో కోహ్లీ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. శుభ్‌మన్ గిల్ 66 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు. సాధికారికంగా ఆడిన ఈ జోడీని ఆదిత్య అశోక్ విడదీసాడు. ఊరించే బంతితో శుభ్‌మన్ గిల్‌ను క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
గిల్ ఔటైనా.. అయ్యర్‌తో కలిసి కోహ్లీ చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ కూడా బౌండరీల మోత మోగించడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది. సెంచరీ దిశగా సాగిన కోహ్లీని జెమీసన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే జడేజా(4), అయ్యర్‌ను జెమీసన్ పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. హర్షిత్ రాణా దూకుడుగా ఆడి భారత్‌ను గెలుపు రేసులో నిలబెట్టాడు. అతను ఇచ్చిన రెండు క్యాచ్‌లను న్యూజిలాండ్ ఫీల్డర్లు వదిలేయడం ఆ జట్టు కొంపముంచింది. చివరకు రాణాను క్రిస్టియన్ క్లార్క్ ఔట్ చేసినా.. వాష్టింగ్టన్ సుందర్‌తో కలిసి రాహుల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. సిక్సర్‌తో రాహుల్ మ్యాచ్‌ను ముగించడం విశేషం.