
ముంబై: ఇంకా ఏదైనా సాధించాలనే తపనతోనే పంజాబ్ కింగ్స్ టీమ్‌ను వీడానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇది తాను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2018 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన రాహుల్.. వరుసగా 2019, 2020, 2021 నాలుగు సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2020 సీజన్‌కు ముందు ఆ జట్టు సారథ్య బాధ్యతలను కూడా అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడి.. కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌తో జత కట్టాడు.
రూ.17 కోట్ల భారీ ధరకు తీసుకున్న లక్నో అతనికి టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అప్ కమింగ్ సీజన్ నేపథ్యంలో టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాలుపంచుకున్న రాహుల్.. తాజాగా రెడ్‌బుల్ క్రికెట్ సెషన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్‌ను వదిలేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'నాలుగేళ్ల పాటు పంజాబ్ కింగ్స్‌తో కలిసి ఉన్నాను. ఐపీఎల్ ప్రయాణంలో నేను కొత్తగా ఏం నిరూపించుకోగలనో చూడాలని భావించాను. నిజానికి ఈ నిర్ణయం చాలా కఠినమైనది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా నాకు పంజాబ్‌తో విడదీయలేని బంధం ఉంది. కానీ కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతోనే ఆ జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నా. ఈ క్రమంలోనే తనను రిటైన్ చేసుకోవద్దని పంజాబ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాను' అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్-2021 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. ఇలా బ్యాటర్‌గా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం రాహుల్ మంచి మార్కులు సాధించలేకపోయాడు. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయాడు. తాజాగా లక్నోతో జత కట్టిన అతను తన కెప్టెన్సీ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సక్సెస్ సాధిస్తే.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతను భవిష్యత్తులో కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకుంటాడు. లేకుంటే వైస్ కెప్టెన్‌గానే మిగిలిపోతాడు.
ఇక రాహుల్ జట్టును వీడటంతో పంజాబ్ కింగ్స్ తమ నూతన సారథిగా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. ఇక రాహుల్ నిర్ణయాన్ని గౌరవించే అతన్ని వేలంలోకి వదిలేసామని అప్పట్లో పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు.