
ప్రతీ ఒక్కరు రాణించేలా..
ఈ వీడియోలో తొలుత రాహుల్ మాట్లాడుతూ.. ద్రవిడ్ సర్ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేలా శిక్షణ ఇస్తున్నారు. 'ఈసారి మనవెంట ద్రవిడ్ సర్ లాంటి అనుభవజ్ఞుడు ఉండటం బాగా కలిసొస్తుంది. ఇక్కడ ఆయన ఎంతో క్రికెట్ ఆడారు. ఎన్నో పరుగులు సాధించారు. ఇప్పటి వరకు సాగిన ప్రాక్టీస్ సెషన్లలోనే ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా శిక్షణ ఇస్తున్నారు. అలాగే నువ్వు (మయాంక్) ద్రవిడ్ సర్ పర్యవేక్షణలోనూ చాలా క్రికెట్ ఆడావని నాకు తెలుసు. ఇండియా-ఏతో పాటు మరిన్ని మ్యాచ్‌ల్లోనూ ఆయన దగ్గర శిక్షణపొందావు' అని రాహుల్ అన్నాడు.

మాటలతో ఆట తీరును మార్చేస్తాడు..
అనంతరం మయాంక్ మాట్లాడుతూ.. ద్రవిడ్ శిక్షణా పద్ధతులు ఎలా ఉంటాయో వివరించాడు. 'నాకైతే వ్యక్తిగతంగా ఆయన అంటే ఎంతో గౌరవం. మన ఆటను మనమే అర్థం చేసుకునేలా చేస్తారు. తన మాటలతో మన ఆలోచనా విధానం, మన ఆటతీరును మార్చేస్తారు. దాంతో మన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. ఏ ఆటగాడికైనా అత్యుత్తమ శిక్షణ అందించాలన్నదే ఆయన లక్ష్యం. ఆ విధంగా మనం ఇక్కడ మెరుగైన శిక్షణ పొందుతున్నాం. దీంతో రాబోయే సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని మయాంక్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ లేకపోవడంతో..
ఈ పర్యటన నుంచి చివరి క్షణంలో రోహిత్ శర్మ తప్పుకోవడంతో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయమైంది. తొడ కండరాల గాయం కారణంగా మూడు టెస్ట్‌ల సిరీస్ నుంచి రోహిత్ తప్పుుకున్న విషయం తెలిసిందే. దాంతో టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా రాహుల్ అందుకున్నాడు. ఇక ఈ సిరీస్ కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ కసితో రగిలిపోతున్నాడు. బ్యాట్ ద్వారానే అందరికి సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు.

ఆదివారం నుంచే..
డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించింది.


Click it and Unblock the Notifications












