
కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకున్నా.. అంపైర్ల తప్పిదాలు మాత్రం కొనసాగుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ అంపైర్ నోబాల్ విషయంలో ఘోర తప్పిదం చేశాడు. దాంతో లక్నో కెప్టెన్ రాహుల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. నోబాల్ ఎలా అవుతుందని నిలదీసాడు. రివ్యూ తీసుకునే అవకాశం ఉందా? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశం కాగా.. అంపైర్లపై విమర్శలు వస్తున్నాయి.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ వేసిన దుష్మంత్ చమీర.. మొదటి బంతిని రజత్ పాటిదార్‌కు హై ఫుల్ టాస్ రూపంలో సంధించాడు. దాంతో.. ఫీల్డ్ అంపైర్ జయరామన్ మదనగోపాల్ నోబాల్‌గా ప్రకటించాడు. కానీ.. బంతి పాటిదార్ నడుము హైట్‌కి కిందే వెళ్లడంతో అంపైర్ నిర్ణయంపై లక్నో కేఎల్ రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
అంపైర్ జయరామన్ మదనగోపాల్ వద్దకు వెళ్లిన కేఎల్ రాహుల్ ఆ బంతి ఎలా నోబాల్? అంటూ నిలదీసాడు. అదే సమయానికి అక్కడికి కృనాల్ పాండ్యా కూడా వెళ్లడంతో వాగ్వాదం పెరిగింది. దాంతో.. అంపైర్ జయరామన్ మదనగోపాల్.. రాహుల్, కృనాల్‌కి సర్దిచెప్పడంలో కాస్త ఒత్తిడికి గురయ్యాడు. ఇది గమనించిన స్వ్కేర్ లెగ్ అంపైర్ మైకేల్ జోక్యం చేసుకొని.. ఆ నోబాల్ నిర్ణయం నాదేనంటూ రాహుల్, కృనాల్‌కి చెప్పాడు. దాంతో.. ఆ నిర్ణయంపై రివ్యూకి అవకాశం ఉందా? అని కేఎల్ రాహుల్ ప్రశ్నించగా.. లేదంటూ గోఫ్ స్పష్టం చేశాడు. దాంతో.. లక్నో కెప్టెన్ మౌనంగా వెళ్లిపోయాడు.
ఇక రిప్లైలో ఆ బంతి నోబాల్ కాదని స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ.. అంపైర్‌దే తుది నిర్ణయం కావడంతో నోబాల్‌గానే పరిగణించారు. అయితే అంపైర్ నిర్ణయాన్ని మాత్రం నెటిజన్లు తప్పుబడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79), దీపక్ హుడా(26 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 19వ ఓవర్‌లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి హజెల్ వుడ్ మ్యాచ్ మూమెంటమ్ మార్చేసాడు.