ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ పర్యటనకు ముందు సన్నాహకంగా ఈ సిరీస్ ఆడుతున్న భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(11), దేవదత్ పడిక్కల్(1), ధ్రువ్ జురెల్(1), తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
సాయి సుదర్శన్(140 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75) ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. నారయణ్ జగదీషన్(45 బంతుల్లో 6 ఫోర్లతో 38)పర్వాలేదనిపించాడు. దాంతో భారత్-ఏ జట్టు 52.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెన్రీ థోర్న్టన్(4/36) నాలుగు వికెట్లు తీయగా.. టాడ్ ముర్ఫీ(2/48) రెండు వికెట్లు పడగొట్టాడు. విల్ సథర్లాండ్, కోరీ రోచిసియోలి, కూపర్ కొన్నోల్లీ చెరో వికెట్ తీసారు. దాంతో ఆస్ట్రేలియాకు 226 పరుగుల భారీ భాగస్వామ్యం దక్కింది.

ఈ భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ(11 బ్యాటింగ్) ఉండగా.. సామ్ కోన్‌స్టాన్(3), కాంప్‌బెల్ కెల్లవే(0), ఒలివర్ పీక్(1) నిరాశపర్చారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాక్ ఎడ్వర్డ్స్(88), నాథన్ మెక్‌స్వీనీ(74), టాడ్ మర్ఫీ(76) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్(5/107) ఐదు వికెట్లు తీయగా. గర్నూర్ బ్రార్ (3/75) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీసారు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్ల వైఫల్యం ఆందోళనకు గురిచేస్తోంది.