సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) రనౌట్‌గా వెనుదిరిగాడు. కీలక సమయంలో ఔటయ్యాననే బాధతో రాహుల్ త్రిపాఠి కన్నీటి పర్యంతమయ్యాడు.
మైదానం ధాటిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే మెట్లపై కూర్చుండిపోయిన రాహుల్ త్రిపాఠి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హార్ట్ బ్రేకింగ్ పిక్ అంటూ నెటిజన్లు రాహుల్ త్రిపాఠి ఫోటోను షేర్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రాహుల్ త్రిపాఠి.. హెన్రీచ్ క్లాసెన్‌తో కలిసి ఆదుకున్నాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడుతూ.. ఐదో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తీ విడదీసాడు.
ఊరించే బంతితో హెన్రీచ్ క్లాసెన్‌ను క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. అబ్దుల్ సమద్‌తో సమన్వయ లోపంతో లేని పరుగుకు ప్రయత్నించి రాహుల్ త్రిపాఠి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సన్వీర్ సింగ్(0) కూడా క్లీన్ బౌల్డ్ కావడంతో రాహుల్ త్రిపాఠి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.
మెట్లపైనే కూర్చుండిపోయాడు. తనవల్లనే జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందని, ఇన్నింగ్స్ పూర్తయ్యేవరకు ఆడాల్సిందని తనలో తానే బాధపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 160 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. మిచెల్ స్టార్క్(3/34) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది.
రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(3) వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది.