సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్(0) తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్-1లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ దారుణంగా విఫలమయ్యాడు.
మిచెల్ స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగులేమి చేయకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. స్టార్క్ వేసిన లెంగ్త్ బాల్‌ను ట్రావిస్ హెడ్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్‌లో నుంచి దూసుకెళ్లిన బంతి మిడిల్ స్టంప్‌ను లేసింది.

ఈ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన ట్రావిస్ హెడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ ట్రావిస్ హెడ్ ఇదే తరహా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో తొలి బంతికి ఔటైన ట్రావిస్ హెడ్.. తాజా మ్యాచ్‌లో రెండో బంతికి వెనుదిరిగాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ట్రావిస్ హెడ్ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి రెండు బౌండరీలు బాదినా.. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో రాహుల్ త్రిపాఠా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఓ సిక్సర్‌తో దూకుడు కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డి.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే షెహ్‌బాజ్ అహ్మద్‌ను అప్‌ది ఆర్డర్ బ్యాటింగ్‌కు పంపంగా.. స్కార్క్ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 39 పరుగులకే సన్‌రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు నిరాశపరచడంపై సన్‌రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం తప్పుడు నిర్ణయమేమోనని కామెంట్ చేస్తున్నారు.