
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో కూడా చిత్తయింది. పసలేని బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు సమష్టిగా రాణించిన కేకేఆర్ అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. మరో మ్యాచ్ గెలిస్తే కేకేఆర్ సైతం టోర్నీలో ముందడుగు వేస్తుంది.
తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 116 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 10 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లతో 25) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దినేశ్ కార్తీక్(18 నాటౌట్) బౌండరీతో విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ తలో వికెట్ తీశారు.