కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్‌తో పాటు శతకం సాధించిన మూడో ప్లేయర్‌గా.. తొలి కేకేఆర్ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా సునీల్ నరైన్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సునీల్ నరైన్.. 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్ తరఫున సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. 2008లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కేకేఆర్ తరఫున తొలి సెంచరీ బాదగా.. 2023లో వెంకటేశ్ అయ్యర్ శతకం సాధించాడు. తాజా సీజన్‌లో సునీల్ నరైన్ కేకేఆర్ తరఫున సెంచరీ నమోదు చేశాడు.

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్‌తో పాటు సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, షేన్ వాట్సన్.. సునీల్ నరైన్ కన్నా ముందున్నారు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. స్పిన్ బౌలర్ అయిన సునీల్ నరైన్‌కు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
స్పిన్నర్ అయిన నరైన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసిన గంభీర్.. అతని శతకం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశాడు. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సైతం నరైన్ సెంచరీకి ఫిదా అయ్యాడు. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లతో పాటు స్టేడియం మొత్తం సునీల్ నరైన్ సెంచరీకి స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చారు. నరైన్ ఔట్ చేసిన రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సైతం అతన్ని ప్రశంసించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కేకేఆర్ చరిత్రలోనే నరైన్ సెంచరీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌తో 109) విధ్వంసకర శతకంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. అతనికి తోడుగా రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30), రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) రాణించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.