ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపుతోంది. ఫస్టాఫ్ లీగ్ ముగిసే సరికి ఆ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు ఆ జట్టును గెలిపిస్తున్నాడు.
జోస్ బట్లర్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్, కుల్దీప్ సేన, యుజ్వేంద్ర చాహల్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొస్తుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆఖరి బంతికి రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.

బట్లర్ ఒంటరి పోరాటం..
ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు జోస్ బట్లర్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 నాటౌట్) అజేయ శతకంతో రాజస్థాన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిడిల్ ఓవర్లలో రోవ్‌మన్ పోవెల్(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) ధాటిగా ఆడటం జోస్ బట్లర్‌పై ఒత్తిడిని తగ్గించింది.
దాంతోనే రాజస్థాన్ గెలుపు క్రెడిట్ జోస్ బట్లర్‌తో పాటు రోవ్‌మన్ పోవెల్‌కు ఇస్తున్నారు. కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్‌తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మ్యాచ్ విన్నర్ రియాన్ పరాగ్..
అయితే ఈ ఇద్దరితో పాటు రియాన్ పరాగ్‌కు కూడా విన్నింగ్ క్రెడిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రియాన్ పరాగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) పవర్ ప్లేలో దూకుడుగా ఆడటంతో ఫీల్డింగ్‌లో బౌండరీ లైన్ వద్ద ఓ సిక్సర్‌ను ఆపాడని గుర్తు చేస్తున్నారు. ఆ సిక్సర్‌నే ఆపకుండా ఉండి ఉంటే రాజస్థాన్ రాయల్స్ గెలిచేది కాదని అభిప్రాయపడుతున్నారు.
రింకూ సింగ్ కొట్టిన ఆ భారీ సిక్సర్‌ను రియాన్ పరాగ్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు. కానీ సమన్వయం కోల్పోతున్నట్లు గ్రహించిన అతను చాకచక్యంగా బంతిని లోపలికి విసిరేసాడు. దాంతో సిక్సర్‌గా వెళ్లాల్సిన బంతి సింగిల్‌గా మారింది. రియాన్ పరాగ్ తన సూపర్ ఫీల్డింగ్‌తో 5 పరుగులు సేవ్ చేశాడు.
సిక్సర్ కాస్త సింగిల్‌గా..
కుల్దీప్ సేన్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని కుల్దీప్ సేన్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. రింకూ సింగ్ లాంగాన్ దిశగా భారీ సిక్సర్‌కు ప్రయత్నించాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పరాగ్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. కానీ సమన్వయం కోల్పోవడంతో మైదానంలోకి విసిరేసాడు.
దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారింది. ఆ మరుసటి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం నాలుగు బంతుల్లో రింకూ సింగ్ ఓ భారీ సిక్సర్ సాయంతో 8 పరుగులే చేశాడు. పరాగ్ గనుక ఆ సిక్సర్ వదిలేసి ఉంటే రింకూ సింగ్ చెలరేగిపోయేవాడు. బౌలర్ సైతం ఒత్తిడిలో చెత్త బంతులు వేసేవాడు. పరాగ్ కారణంగా 10-15 పరుగులు కేకేఆర్ తక్కువ చేసింది. ఇవి చేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చాయి.