కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అద్భుతమైన బౌలింగ్‌తోనే ఐపీఎల్ 2025 సీజన్‌లో శుభారంభం చేశామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన రజత్ పటీదార్.. ఈ జైత్రయాత్రను ఇలానే కొనసాగిస్తే బాగుంటుందన్నాడు. 'కెప్టెన్సీ కాస్త ఒత్తిడిగానే ఉంది. కానీ ఈ రోజు నాకు కలిసొచ్చింది. మేం ఇలానే విజయాలు సాధిస్తే మరింత బాగుంటుంది. సుయాశ్ పరుగులివ్వడాన్ని నేను అస్సలు పట్టించుకోలేదు. అతని మా ప్రధాన వికెట్ టేకింగ్ బౌలర్. కాబట్టి అతనికి అండగా నిలిచాను. ఈ గెలుపు క్రెడిట్ కృనాల్, సుయాష్‌లదే.

13వ ఓవర్ నుంచి వారు ధైర్యంతో పాటు ఆట పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రదర్శించారు. వికెట్లు తీయాలనే మైండ్ సెట్ ఉండటం అద్భుతం. విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. ఈ గేమ్‌కు గ్రేటెస్ట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి కుర్రాళ్లుగా మేం ఎంతో నేర్చుకుంటాం. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ ముందే అనుకొని ఆడింది. నేను ఓవర్ కవర్స్ మీదుగా ఆడుదామనుకున్నా. కవర్స్ వైపు ఆడాలనుకున్నాను. కానీ బ్యాట్‌కు సడన్‌గా తాకింది.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44) దూకుడుగా ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా(3/29), జోష్ హజెల్ వుడ్(2/22) కేకేఆర్ పతనాన్ని శాసించారు.
అనంతరం ఆర్‌సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. రహానే- నరైన్ ధాటికి ఓ దశలో కేకేఆర్ 220 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృనాల్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.