For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs LSG: కొంపముంచిన రస్సెల్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన కేకేఆర్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ విజయం కోసం రింకూ సింగ్(15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) పోరాడినా ఫలితం దక్కలేదు. ఆండ్రీ రస్సెల్(7) వైఫల్యం కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీసింది.

239 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్(2/55), శార్దూల్ ఠాకూర్(2/47) రెండేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రతి, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.

KKR vs LSG IPL 2025 Andre Russell Flop Show Helps Lucknow Super Giants Beat Kolkata Knight Riders

అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81), నికోలస్ పూరన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా(2/51) రెండు వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్ ఓ వికెట్ పడగొట్టాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మొత్తం 15 సిక్సర్లు నమోదవ్వగా.. మార్ష్, పూరన్‌లే 13 సిక్స్‌లు కొట్టారు.

అదిరిపోయే ఆరంభం..
భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడారు. కానీ డికాక్‌(15)ను ఆకాశ్‌దీప్ వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి నరైన్ చెలరేగాడు. రహానే సైతం బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఆ వెంటనే రిషభ్ పంత్.. దిగ్వేష్ రతిని బౌలింగ్ తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు. దూకుడుగా ఆడుతున్న నరైన్‌ను రతి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కేకేఆర్ కొంపముంచిన మిడిలార్డర్..
వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ కూడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో రహానే 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 71 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని లార్డ్ శార్దూ‌ల్ ఠాకూర్ విడదీసాడు. రహానేను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రమణ్‌దీప్ సింగ్(1)ను రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. అంగ్‌క్రిష్ రఘు వంశీ(5)ని ఆవేశ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు.

ఆ మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీకి చేరువైన వెంకటేశ్ అయ్యర్‌ను ఆకాశ్ దీప్ పెవిలియన్ చేర్చి కేకేఆర్‌ను దెబ్బతీసాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన ఆండ్రూ రస్సెల్(7) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. భారీ సిక్సర్‌తో జోరు కనబర్చిన రస్సెల్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

రింకూ సింగ్ ఒంటరి పోరాటం..
హర్షిత్ రాణాతో కలిసి రింకూ సింగ్ చెలరేగాడు. 19వ ఓవర్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో రింకూ సింగ్ 14 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో హిట్టర్ లేకపోవడంతో రింకూ మూడు సింగిల్స్ వదిలేసాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు అవసరమవ్వగా.. హర్షిత్ రాణా.. తొలి మూడు బంతులాడి 5 పరుగులే చేశాడు. చివరి మూడు బంతుల్లో రింకూ 4, 4, 6 బాదాడు. ఈ ఓవర్‌లో రింకూ సింగ్ తొలి బంతి నుంచి స్ట్రైక్ తీసుకున్నా.. కేకేఆర్ విజయం సాధించేది. ఆండ్రీ రస్సెల్ కాసేపు ఆడినా ఫలితం మరోలా ఉండేది.

మిచెల్ మార్ష్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆచితూచి ఆడిన ఓపెనర్లు మార్క్‌రమ్, మిచెల్ మార్ష్.. తెలివిగా బ్యాటింగ్ చేశారు. టైట్ బౌలింగ్‌ను గౌరవించిన ఈ జోడీ.. లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలించింది. పవర్ ప్లేలో స్పెన్సర్ జాన్సన్‌పై ఎదురు దాడికి దిగిన ఈ జోడీ.. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌ను ఆచితూచి ఆడింది. దాంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 56 పరుగులే చేసింది. ఆ తర్వాత కూడా వరుణ్‌ను గౌరవించిన ఈ ఇద్దరూ మిగతా బౌలర్ల‌పై విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీ ముంగిట మార్క్‌రమ్(47)ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో కవర్స్ దిశగా బౌండరీ బాదిన మిచెల్ మార్ష్.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పూరన్ ఊచకోత..
అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారీ సిక్స్‌లు బాదాడు. అతనికి తోడుగా నికోలస్ పూరన్ కూడా చెలరేగడంతో లక్నో స్కోర్ బోర్డు పరుగెత్తింది. సెంచరీ దిశగా సాగిన మిచెల్ మార్ష్‌ను రస్సెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మార్ష్ ఔటైనా.. పూరన్ తన దూకుడు కొనసాగించాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాది 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రస్సెల్ వేసిన 18వ ఓవర్‌లో 0,4,6,4, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. చివరి రెండు ఓవర్లు కేకేఆర్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో లక్నో 238 పరుగులకే పరిమితమైంది.

Story first published: Tuesday, April 8, 2025, 19:30 [IST]
Other articles published on Apr 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+