కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస ప్రయోగాలు చేస్తూ మూల్యం చెల్లించుకుంటున్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్.. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపిస్తూ ప్రయోగం చేసింది. కానీ శార్దూల్ ఠాకూర్ డకౌట్‌గా వెనుదిరిగడంతో కేకేఆర్ మేనేజ్‌మెంట్ వేసిన ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది.
మహమ్మద్ షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శార్దూల్ ఠాకూర్.. మోహిత్ శర్మ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఫ్యాన్స్ అభిమానులు మండిపడుతున్నారు. శార్దూల్ ఠాకూర్ ఏమైనా విరాట్ కోహ్లీ అనుకుంటున్నారా? ఫస్ట్ డౌన్‌లో వచ్చి చెలరేగడానికి అని సెటైర్లు పేల్చుతున్నారు.

ఆర్‌సీబీతో ఏదో గాలివాటం ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించినంత మాత్రాన అతను స్వచ్చమైన బ్యాటర్ అవుతాడా? అని విమర్శిస్తున్నారు. ఇక ఈ ఏడాది గుజరాత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అతను తాజా మ్యాచ్‌లోనూ సున్నాకే వెనుదిరిగాడు.
ఈ సీజన్‌లో కేకేఆర్ చేసినన్ని ప్రయోగాలు మరే జట్టు కూడా చేయలేదు. అనేక కాంబినేషన్‌లను మార్చిన కేకేఆర్.. ఓపెనింగ్ జోడీలోని ప్రయోగాలు చేసి విఫలమైంది. దాంతో కేకేఆర్‌ను పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ పోల్చుతున్నారు. 'అంతార్జాతీ క్రికెట్‌లో పాకిస్థాన్ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం. వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కూడా అలాగే ఉంటాయి. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి కూడా పాకిస్థాన్ టీమ్‌లానే ఉంది'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రీ రస్సెల్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.