
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న బౌలర్లు వరుస విరామాల్లో ఢిల్లీని దెబ్బతీశారు. దాంతో పంత్ సేన ప్రత్యర్థి ముందు 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 4 ఫోర్లతో 39), రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/18), వెంకటేశ్ అయ్యర్(2/29), లూకీ ఫెర్గూసన్(2/10) రెండేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరిగారు. షార్జా అంటే సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్ పిచ్ శైలికి తగ్గట్లు నిధానంగా ఆడారు. రిస్కీ షాట్లు ఆడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని ఫెర్గూసన్ విడదీసాడు. శిఖర్ ధావన్‌ను(24) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరడంతో ఫస్ట్ వికెట్‌కు నమోదైన 35 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(1) నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో హెట్‌మైర్‌తో కలిసి స్టీవ్ స్మిత్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు.
కానీ స్మిత్‌ను ఫెర్గూసన్ బౌల్డ్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్ పేకమేడల్లా కూలింది. వెంకటేశ్ అయ్యర్.. హెట్‌మైర్‌ను క్యాచ్ ఔట్ చేయగా.. ఆ వెంటనే లలిత్ యాదవ్(0)ను నరైన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా డకౌటవ్వడంతో నాలుగు పరుగుల వ్యవధిలోనే ఢిల్లీ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రిషభ్ పంత్ పోరాడే ప్రయత్నం చేశాడు. బౌండరీలు బాదేందుకు నానా కష్టాలు పడ్డాడు. చివరకు రనౌట్‌గా వెనుదిరగడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోయింది.