కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు గెలుపొందింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్. అజింక్యా రహానే(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71), డేవాన్ కాన్వే(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), శివమ్ దూబే(21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో కుల్వాంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. జాసన్ రాయ్(26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), రింకూ సింగ్(27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ సింగ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మతీశ పతీరణ తలో వికెట్ తీసారు.
ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. పలు రికార్డలను నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అత్యధిక ఐపీఎల్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన టీమ్‌గా.. 25 కంటే తక్కువ బంతులాడి ఎక్కువ మంది హాఫ్ సెంచరీలు నమోదు చేసిన జట్టుగా రికార్డుకెక్కింది.
రికార్డు లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు నారయణ్ జగదీషన్(1), సునీల్ నరైన్(0) దారుణంగా విఫలమయ్యారు. తుషార్ దేశ్ పాండే వేసిన తొలి ఓవర్‌లోనే జగదీషన్ ఔటవ్వగా.. ఆకాశ్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో సునీల్ నరైన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 2 వికెట్లకు 38 పరుగులే చేసింది. పవర్ ప్లే అనంతరం వెంకటేశ్ అయ్యర్(20), నితీశ్ రాణా(27) కూడా వెనుదిరగడంతో కేకేఆర్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చేలరేగాడు. 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని తీక్షణ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆండ్రీ రస్సెల్‌ను పతీరణ ఔట్ చేశాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు రింకూ సింగ్ ధాటిగా ఆడాడు. డేవిడ్ వైస్(1), ఉమేశ్ యాదవ్ విఫలమైనా.. రింకూ సింగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని టీమ్ ఆలౌటవ్వకుండా చూసుకున్నాడు.