ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) పేసర్ హర్షిత్ రాణా నడవలేని స్థితిలో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు సౌతాఫ్రికాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో హర్షిత్ రాణా మొకాలికి గాయమైంది.
దాంతో అతను చివరి నిమిషంలో మెగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హర్షిత్ రాణా హాజరయ్యాడు. నడవలేని స్థితిలో ఉన్న హర్షిత్ రాణా.. హాండ్ స్టిక్ సాయంతో కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో హర్షిత్ రాణా ఆడటం కష్టమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఈ సీజన్ మొత్తానికి అతను దూరంగా ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కేకేఆర్.. హర్షిత్ రాణా గైర్హాజరీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

హర్షిత్ రాణా గైర్హాజరీ కేకేఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బనే. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలవడంలో హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో అతను 19 వికెట్లు పడగొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అతన్ని కేకేఆర్ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోగా.. 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసాడు. ఇప్పటివరకైతే కేకేఆర్ హర్షిత్ రాణా ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఆకాశ్ దీప్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగిలో ఒకర్ని ఎంచుకోనుంది.
దురదృష్టవశాత్తు హర్షిత్ రాణా.. ఈ సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాశ్ దీప్‌లో ఒకరికి అతని స్థానంలో అవకాశం దక్కనుంది. రిప్లేస్‌మెంట్‌ను ఇంకా నిర్ణయించలేదు.'అని కేకేఆర్ వర్గాలు మీడియాకు తెలిపాయి. ముస్తాఫిజుర్ స్థానాన్ని కేకేఆర్ బ్లెస్సింగ్ ముజరబానితో భర్తీ చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ గత శుక్రవారం వెల్లడించింది.