IPL 2021: మలిదశ మ్యాచ్‌లకు ఆ ఐదుగురు ఆస్ట్రేలియన్లు దూరం! చిక్కుల్లో కేకేఆర్, పంజాబ్, ఆర్‌సీబీ!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. యూఏఈ వేదికగా జరగనున్న ఈ సెకండాఫ్ లీగ్ కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాలు మొదలుపెట్టాయి. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అరబ్ గడ్డపై ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇతర ఫ్రాంచైజీలు ఈ నెలాఖారులోపు యూఏఈకి పయనం కానున్నాయి. అయితే ఈ మలిదశ మ్యాచ్‌లకు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్) జట్లకు కొత్త కష్టాలు ఎదురయ్యాయి.
యూఏఈ వేదికగా జరగనున్న ఈ మలిదశ లీగ్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్, జై రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో గత నెలలో ఆస్ట్రేలియా టీమ్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలకు కూడా ఈ నలుగురు ఆటగాళ్లు వెళ్లలేదు. దాంతో ఈ నలుగురి ఆటగాళ్ల ప్లేస్‌లో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఆర్‌సీబీ, కేకేఆర్, పంజాబ్‌కు వచ్చింది.

భార్య కడుపుతో ఉండటంతో..
కేకేఆర్ జట్టులో ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ చాలా కీలకం. రూ.15.5 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. గత రెండు సీజన్లుగా అతను బౌలింగ్ విభాగానికి సారథ్యం వహిస్తున్నాడు. అయితే అతని సతీమణి సెప్టెంబర్ నెలాఖరులో బిడ్డకు జన్మనివ్వనుంది. 'దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఐపీఎల్ ఆడలేను. ఇప్పటికైతే ఎలాంటి అధికార నిర్ణయం తీసుకోలేదు. కానీ నా సతీమణి కడుపుతో ఉంది. ఐపీఎల్ మధ్యలోనే మా జీవితంలోకి మా సంతానం రానుంది. ప్రస్తుత ప్రయాణ ఆంక్షల నడుమ ఆ సమయంలో నేను ఆస్ట్రేలియాకు తిరిగిరావడం కష్టమవుతోంది. కనీసం రెండు వారాల క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటా'అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

కరోనా.. క్వారంటైన్ భయం..
పంజాబ్ జట్టుకు చెందిన జై రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్‌లు కరోనా భయంతో లీగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరిని పంజాబ్ రూ.14 కోట్లు, రూ. 8 కోట్ల భారీ ధరకు తీసుకుంది. వారి గైర్హాజరీ టీమ్ బౌలింగ్ విభాగంపై పడనుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమ్ మరి బలహీనపడనుంది. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే బ్యాకప్ బౌలర్లు ఉండాల్సిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లను ఎంత కన్విన్స్ చేసినా వాళ్లు అంగీకరించడం లేదని, వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీమ్ సీఈవో సతీష్ మీనన్ తెలిపాడు. వారిస్థానాల్లో తీసుకునేందుకు ఇతర ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నామన్నాడు. వచ్చే రెండు, మూడు రోజుల్లో అనిల్ కుంబ్లే తుది నిర్ణయం తీసుకుంటాడని, ఇప్పటికే నాథన్ అల్లిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపాడు.

ఆర్‌సీబీలోకి హసరంగా..
ఆర్‌సీబీ తరఫున ఏకైక మ్యాచ్ ఆడిన కేన్ రిచర్డ్‌సన్.. లీగ్ మధ్యలోనే ఆడమ్ జంపాతో కలిసి జట్టును వదిలి స్వదేశానికి పయనమయ్యాడు. తాజాగా యూఏఈ వేదికగా జరిగే లీగ్‌కు కూడా దూరంగా ఉంటానని చెప్పాడు. ఆడమ్ జంపా సైతం తప్పుకున్నాడు. ఇక ఆర్‌సీబీ కేన్ రిచర్డ్‌సన్ నాలుగు కోట్ల భారీ ధరకు తీసుకుంది. అయితే జంపా స్థానంలో శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగాను తీసుకున్న ఆర్‌సీబీ.. రిచర్డ్‌సన్ రిప్లేస్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

రేసులో ఆదిల్ రషీద్, నీల్ వాగ్నర్..
ఈ ఐదుగురి ప్లేస్‌లను భర్తీ చేయడానికి ఈ మూడు ఫ్రాంచైజీలు మర్చంట్ ది లాంగే, ఆదిల్ రషీద్, నీల్ వాగ్నర్, సకీబ్ మహమ్మూద్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగాను తీసుకున్నామని ఇప్పటికే ఆర్‌సీబీ ప్రకటించింది. ఇంగ్లండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్.. ది హండ్రెడ్ లీగ్‌లో దుమ్మురేపుతున్నాడు. దాంతో అతను ఐపీఎల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. పేసర్ మర్చంట్ ది లాంగే కూడా హండ్రెడ్ లీగ్‌లో అదరగొడుతున్నాడు. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ యువ పేసర్ సకీబ్ మహమ్మద్ సైతం ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications