ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన గత మ్యాచ్‌లో ఒక్క పరుగుతో గెలిచిన కేకేఆర్.. అదే జోరును కొనసాగించడంపై ఫోకస్ పెట్టింది.
మరోవైపు గత 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిన పంజాబ్ కింగ్స్.. విజయాల బాట పట్టడంపై ఫోకస్ పెట్టింది. దాంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగనుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో జట్టుకు దూరమవ్వడం ఆ జట్టకు తీరని నష్టం చేస్తోంది.

పాపం నితీష్ రాణా..
కేకేఆర్‌తో మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరంగా ఉండనున్నాడు. మరోవైపు కేకేఆర్ కాంబినేషన్‌లోనూ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. దాంతో నితీష్ రాణాకు మరోసారి నిరాశే ఎదురు కానుంది. చేతి వేలి గాయంతో జట్టు నుంచి తప్పుకున్న అతను ఈ సీజన్‌లో పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అతని గైర్హాజరీలో బరిలోకి దిగిన యువ ప్లేయర్ రఘు వంశీ సత్తా చాటుతుండటంతో గాయం నుంచి కోలుకున్నా నితీష్ రాణాకు అవకాశం ఇవ్వడం లేదు. కేకేఆర్ ఓపెనర్లుగా సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

మిచెల్ స్టార్క్‌పై వేటు..
మిడిలార్డర్‌లో రఘు వంశీ, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్ ఆడనున్నారు. రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. బ్యాటింగ్ విభాగంలో రింకూ సింగ్ ఒక్కడే తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మిగతా బ్యాటర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఒక్కడే విఫలమవుతుండగా.. మిగతా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. రూ. 24.75 కోట్ల భారీ ధరకు స్టార్క్‌ను తీసుకోగా.. అతను ధారళంగా పరుగులిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 ఎకానమీ రేటుతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. ఒకవేళ అతనిపై వేటు వేయాలనుకుంటే మాత్రం శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా తుది జట్టులోకి వస్తాడు.
కేకేఆర్ తుది జట్టు(అంచనా)
సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా
ఇంపాక్ట్ ప్లేయర్: అనుకుల్ రాయ్, నితీష్ రాణా, వైభవ్ అరోరా