ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే గాయాల బెడదతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు శుభవార్త అందింది. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీష పతీరణ టోర్నీలో పాల్గొనడంపై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది.
ఐసీసీ టీ20 ప్రపంచప్ 2026 మధ్యలోనే గాయపడి టోర్నీకి దూరమైన మతీష పతీరణ ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 2న జరిగే కేకేఆర్ రెండో మ్యాచ్‌కు పతీరణ అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియా పేర్కొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. పతీరణ ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా జరిగే కేకేఆర్ తొలి మ్యాచ్‌కు మాత్రమే పతీరణ అందుబాటులో ఉండడు.

మరోవైపు మతీష పతీరణకు ఐపీఎల్ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయలేదని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. పతీరణకు ఎన్‌ఓసీ ఇచ్చినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ బందుల దిస్సానాయకే పీటీఐకి తెలిపారు. పతిరానా తన రిహాబిలిటేషన్‌ను పూర్తి చేసుకున్నాడని, ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడని కూడా ఆయన చెప్పారు. అతని సన్నద్దతను అంచనా వేసే బాధ్యత ఫ్రాంచైజీపై ఉంటుందన్నాడు. తమకు తెలిసినంతవరకు ఐపీఎల్ ఆడేందుకు పతీరణ సిద్దంగా ఉన్నాడు.
ఇప్పటికే హర్షిత్ రాణా మోకాలి గాయంతో ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడిన సంగతి తెలిసిందే. అతని మోకాలి గాయానికి శస్త్ర చికిత్స జరగ్గా.. హర్షిత్ రాణా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న అతను ఈ సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
బీసీసీఐ ఆదేశాలతో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన కేకేఆర్.. అతని స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరాబానిని తీసుకున్న సంగతి తెలిసిందే. మతీష పతీరణ రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా మారనుంది.