దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యతనిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ వికెట్ కీపర్ కీర్తి ఆజాద్ స్వాగతించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని అభిప్రాయపడ్డాడు. ఇక దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వని టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
వార్షిక కాంట్రాక్ట్‌ల్లో వారికి అవకాశం ఇవ్వలేదు. 2023-24 ఏడాదికి సంబంధించిన భారత ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. గతేడాది గ్రేడ్ బీ కాంట్రాక్ట్ కలిగిన శ్రేయస్ అయ్యర్, గ్రేడ్ సీలో ఉన్న ఇషాన్ కిషన్‌ల కాంట్రాక్ట్‌లను తొలగించింది. ఈ వార్షిక కాంట్రాక్ట్‌లకు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల పేర్లను పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగితిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. రూల్స్ అందరికి వర్తింపజేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాట్లాడిన కీర్తి ఆజాద్ బీసీసీఐ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. 'ఇదో అద్భుతమైన నిర్ణయం. ప్రతీ ఒక్కరూ రంజీ క్రికెట్ ఆడాల్సిందే. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఐపీఎల్ మంచి వినోదాత్మకమైన టోర్నీ. కానీ అసలైన క్రికెట్ ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్.

దేశవాళీ క్రికెట్‌లో ఆడటం మంచిది. అది ఆటగాళ్ల ఆటను మెరుగుపరుస్తోంది. ఎంత పెద్ద స్టార్ ఆటగాడు అయినా.. ఖాళీ దొరికితే దేశవాళీ క్రికెట్ ఆడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయినా దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. మా తరంలో బిషన్ సింగ్ బేడీ, మదన్ లాల్, సురేందర్ అమర్‌నాథ్, మోహిందర్ అమర్‌నాథ్, చేతన్ చాహన్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్ వంటి ఆటగాళ్లు యువకులతో కలిసి దేశవాళీ క్రికెట్ ఆడేవారు. 'అని కీర్తి ఆజాద్ చెప్పుకొచ్చాడు.