టీమిండియా భవిష్యత్తు సారథి రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ టూర్ తర్వాత క్లారిటీ: మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తోన్న వాదనలకు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె మద్దతు తెలిపాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ రోహిత్ శర్మనేనని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె.. రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్..
'బోర్డు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. రోహిత్ శర్మకు త్వరలోనే భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వస్తుందనుకుంటున్నా. ధోనీ ఆధ్వర్యంలో కోహ్లీ తెలివిగల సారథిగా వృద్ధి చెందాడు. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఉండాలని అనుకుంటాడు? అతడు కూడా ఈ విషయమై ఆలోచిస్తాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్‌తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. భారత్‌లో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే పంథా సెట్ అవుతుంది. టీమిండియా భవిష్యత్‌ను తీర్చిదిద్దటం ఎంతో ముఖ్యమని సీనియర్ ఆటగాళ్లు భావిస్తారు.

కోహ్లీ ఒక్కడే ఏన్నాళ్లు రాణిస్తాడు..
కోహ్లీ ఒక్కడే మంచి ప్రదర్శన చేస్తూ.. మూడు ఫార్మాట్లను నడిపించటం అంత సులువు కాదు. ప్రస్తుతం అతను కెప్టెన్‌గా జట్టును గెలిపిస్తూ బాగానే ఆడుతున్నాడు. అయితే.. 'ఇక చాలు.. రోహిత్ ఇకపై నా బాధ్యతలు పంచుకుంటాడు' అని ఏదో ఒక రోజు అంటాడని అనుకుంటున్నా. తప్పకుండా ఇది మన భవిష్యత్ తరాలకు ఓ మంచి బలమైన సందేశంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా విరాట్ మీద అధారపడి ఉంటుంది. అతడు మనిషే కదా, తన మెదడూ అలిసిపోతుంది కదా" అని మోరె చెప్పుకొచ్చాడు.

కోహ్లీ కెప్టెన్సీపై వేటు పడనుందా?
టీ20 ప్రపంచకప్ ముందు కిరణ్ మోరె చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును రోహిత్ శర్మను నడిపించనున్నాడా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఫలితం అనుకూలంగా లేకపోతే కోహ్లీ కెప్టెన్సీపై వేటు పడనుందా? అనే ప్రచారం ఊపందుకుంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై క్లారిటీ రానుందని కిరణ్ మోరె చెప్పడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీసేన న్యూజిలాండ్‌తో జూన్ 18-22 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లీష్ జట్టుతో ఆగస్టు 4-సెప్టెంబరు 14వరకు టెస్టు సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications