న్యూఢిల్లీ: టీమిండియా యువ ప్లేయర్, ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్‌పై మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో రింకూ సింగ్ బెస్ట్ ఫినిషర్ అవుతాడని తెలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌లా బెస్ట్ ఫినిషర్‌గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆఖరి 5 బంతులకు 5 సిక్స్‌లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా రింకూ సింగ్ పేరు మారుమోగింది.

రింకూ సింగ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు పట్టించుకోని సెలెక్టర్లు.. చైనా వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేశారు. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులోనూ అవకాశం కల్పించారు. రింకూ సింగ్ అరంగేట్రం సందర్భంగా జియో సినిమాతో మాట్లాడిన కిరణ్ మోరే అతనికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపాడు.
'భారత జట్టులోకి అతను (రింకూసింగ్) ఎప్పుడు వస్తాడా? అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నంబర్ 5, 6లో అతను అద్భుతంగా ఆడగలడు. మ్యాచ్‌లను గొప్పగా ముగించగలడు. గతంలో మనం చూసిన టీమిండియా ఫినిషర్స్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌లా రింకూ సింగ్ రాణించగలడు. ధోనీ, యూవీ రిటైర్మెంట్ అనంతరం వారిలా ఆడే ఫినిషర్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం.
ఫినిషర్ రోల్‌లో చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించాం. కానీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం జట్టులో తిలక్ వర్మ ఉన్నాడు. అతను కూడా ఫినిషర్ రోల్‌కు సరిగ్గా సరిపోతాడు. రింకూ సింగ్ అద్భుతమైన ఫీల్డర్. దేశవాళీ క్రికెట్‌లో అతని ఆటను నేను దగ్గరగా చూశాను. అతను తన ఆటను చాలా మెరుగుపరుచుకున్నాడు.'అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.
కిరణ్ మోరే వ్యాఖ్యలతో ఏకీభవించిన మరో మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్.. రింకూ సింగ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు అతన్ని పరిగణల్లోకి తీసుకోవాలని సూచించాడు.