ధోనీ కోసం గంగూలీని ఒప్పించడానికి 10 రోజులు పట్టింది: మాజీ సెలెక్టర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహీ ఒకడు. వికెట్ల వెనుకాల చాకచక్యంగా వ్యహరించడంలోనూ.. రెప్పపాటు సమయంలో స్టంపింగ్ చేయడం, సూపర్ మ్యాన్‌ల డైవ్ చేస్తూ క్యాచ్‌లు అందుకోవడంలో ఈ జార్ఖండ్ డైనమైట్‌కు సాటిలేరు. అయితే ఆణిముత్యం లాంటి మహేంద్ర సింగ్ ధోనీని భారత జట్టులోకి తీసుకొచ్చింది మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే అనే విషయం అందరికీ పెద్దగా తెలియదు. అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే ధోనీ భారత జట్టులోకి వచ్చాడు. అయితే ధోనీతో వికెట్ కీపింగ్ చేయించేందుకు అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఒప్పించడానికి తనకు 10 రోజుల సమయం పట్టిందని కిరణ్ మోరే తాజాగా గుర్తు చేసుకున్నాడు.

హార్డ్ హిట్టర్ కోసం..
ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మోరే.. ధోనీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టులోకి ఓ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ తీసుకోవాలనుకున్నామని తెలిపాడు. అప్పటి కీపర్ రాహుల్ ద్రవిడ్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు మంచి ఫినిషర్ అయి ఉండాలని భావించామని తెలిపాడు. 'మేం వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలనుకున్నాం. ఆ టైమ్‌లో ఫార్మాట్‌లో కూడా మార్పులు చోటు చేసుకోవడంతో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి వేగంగా 40-50 పరుగులు చేసే పవర్ హిట్టర్ కావాలనుకున్నాం. రాహుల్ ద్రవిడ్ అప్పటికే 75 మ్యాచ్‌లు కీపింగ్ చేశాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. అతనిపై ఒత్తిడి తగ్గించాలనుకున్నాం.'అని తెలిపాడు.

దేశవాళీ మ్యాచ్‌లో..
అయితే ఓ దేశవాళీ మ్యాచ్ సందర్భంగా ధోనీని తొలిసారి చూశానన్న కిరణ్ మోరే.. అతన్ని దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున కీపింగ్ చేయించేందుకు సౌరవ్ గంగూలీని ఒప్పించడానికి 10 రోజులు పట్టిందన్నాడు. అప్పటికే ఆ జట్టు తరఫున దీప్ దాస్ గుప్తా కీపింగ్ చేస్తున్నాడని, ఫైనల్ మ్యాచ్‌లో తనకు ధోనీతో కీపింగ్ చేయించాలనిపించదన్నాడు. దీనికి ముందు గంగూలీ ససేమిరా అన్నాడని, చివరకు ఒప్పుకోవడం ధోనీ ఆకట్టుకోవడం జరిగిపోయిందన్నాడు.

ఒప్పించడానికి 10 రోజులు..
'ధోనీని ముందుగా నా సహోద్యోగి చూసి నాకు చెప్పాడు. నేను చూసిన మ్యాచ్‌లో ధోనీ అద్భుతంగా ఆడాడు. ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్ 170 అయితే అతనొక్కడే 130 పరుగులు చేశాడు. అది నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అతన్ని మేం దులీప్ ట్రోఫీ ఫైనల్లో వికెట్ కీపర్‌గా ఆడించాలనుకున్నాం. దాని కోసం గంగూలీ, దీప్‌దాస్ గుప్తాతో సుదీర్ఘంగా చర్చించాం. ఆ సమయంలో వారు కోల్‌కతాతో పాటు భారత్‌కు ఆడుతున్నారు. ఈస్ట్ జోన్ తరఫున ధోనీని ఆడించేందుకు గంగూలీని ఒప్పించేందుకు 10 రోజులు పట్టింది.'అని మోరె చెప్పుకొచ్చాడు. 2004లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన ధోనీ.. విశాఖ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించి అందరి దృష్టి ఆకర్షించాడు. అప్పటి నుంచి అతని పేరు మోరుమోగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications