ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో తాము ఓడినా క్రికెట్ గెలిచిందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆఖరి సెషన్ వరకు జరిగిన మ్యాచ్‌లో ఓ జట్టు స్వల్ప తేడాతో ఓడిందంటేనే క్రికెట్ గెలిచినట్లని పేర్కొన్నాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనా.. టెయిలెండర్స్ సాయంతో రవీంద్ర జడేజా ఒంటరిపోరాటం చేశాడు. ఓ దశలో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ హైదరాబాద్ పేసర్ సిరాజ్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత ఓటమి లాంఛనమైంది. బషీర్ వేసిన బంతి సిరాజ్ బాగానే డిఫెన్స్ చేసినా.. నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఈ వికెట్ భారత జట్టు గుండెపగిలేలా చేసింది. అభిమానులు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. అయితే టీమిండియా ఇలా స్వల్ప తేడాతో ఓడిపోవడం బ్రిటన్ రాజు చార్లెస్-3ని కూడా బాధకు గురిచేసిందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మంగళవారం భారత ఆటగాళ్లు, మహిళల టీమ్‌తో కలిసి బ్రిటన్ రాజు చార్లెస్-3ని మర్యాద పూర్వకంగా కలిసారు. లండన్‌లోని క్లారెన్ హౌస్ గార్టెన్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత ఆటగాళ్లతో కింగ్ చార్లెస్ సరదాగా ముచ్చటించారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో చివరి బ్యాటర్ ఔటైన తర్వాత ఎలా అనిపించిందని చార్లెస్.. శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించారట. ఈ భేటీ అనంతరం శుభ్‌మన్ గిల్ ఈ విషయాన్ని తెలియజేశాడు. సమావేశానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'కింగ్ చార్లెస్‌తో కలవడం చాలా బాగుంది. ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు. మూడో టెస్ట్‌లో చివరి బ్యాటర్ ఔటైన విధానం చాలా దురదృష్టకరమని అన్నారు. అనుకోకుండా బంతి వికెట్ల మీదకు వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించిందని ప్రశ్నించారు. అది దురదృష్టకరమని చెప్పాను. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని చార్లెస్‌కు చెప్పాం. ఇంగ్లండ్‌లో ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా మాకు ఆదరణ దక్కుతుంది. అందుకు తగ్గట్లే గెలుపు కోసం జట్టు సాయశక్తులా కృషి చేస్తోంది.
సిరీస్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మూడు మ్యాచ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు చివరి సెషన్‌లో ఒక జట్టు స్వల్ప తేడాతో ఓడిందంటే.. ఆ మ్యాచ్‌లో క్రికెట్ గెలిచినట్లే'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. చార్లెస్‌తో భేటీ అనంతరం నాలుగో టెస్ట్ కోసం భారత పురుషుల జట్టు మాంచెస్టర్‌కు బయలుదేరగా.. మహిళల జట్టు వన్డే సిరీస్ కోసం సౌతాంప్టన్‌కు తిరుగు పయనమైంది. నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.