
హార్ట్ టచింగ్ పోస్ట్:
రిటైర్మెంట్ సందర్భంగా తనను గుర్తుచేసుకున్న అభిమానులకు యువరాజ్ సింగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెటే తనకు ప్రాణమని, అభిమానులందరూ తనకు ఎంతో ముఖ్యమని యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 'ప్రియమైన అభిమానులారా.. మీ ఆప్యాయతలో మునిగిపోయా.. కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎల్లప్పుడూ క్రికెటే నా జీవితంగా ఉంటుంది. మీలోని ప్రతి ఒక్కరూ నిత్యం నాలో భాగమై ఉంటారు' అని యువీ పేర్కొన్నాడు.

'గోట్' అంటూ కిమ్ శర్మ కామెంట్:
యువరాజ్ సింగ్ పోస్ట్ సోషల్ మీడియా పుణ్యమాని క్షణాల్లో వైరల్ అయింది. అయితే యువీ ఉద్వేగంగా చేసిన ఈ పోస్ట్‌పై అతడి మాజీ ప్రేయసి, హీరోయిన్ కిమ్ శర్మ రియాక్ట్ అయ్యారు. గోట్ (గేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అంటూ యూవీని పొగిడేసింది. అయితే దీని అర్థం తెలియని కొందరు ఆమెపై సెటైర్స్ వేస్తున్నారు. మరి కొందరు పూర్తిగా రాస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా?.. మొత్తానికి టైమ్ సేవ్ చేసుకున్నావని కామెంట్స్ చేశారు. ఇక కొందరు మాత్రం నిజంగానే గొర్రెను చేశావులే అని నాటి సంగతులను నెమరువేసుకున్నారు. ఏదేమైనా కిమ్ శర్మ ట్వీట్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

నాలుగేళ్ల పాటు ప్రేమాయణం:
యువీ-కిమ్‌ల మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగిన విషయం తెలిసిందే. 2007లో వీరి లవ్ స్టోరీకి ఫుల్‌స్టాప్ పడింది. కిమ్‌తో పెళ్లికి యువీ తల్లి ఒప్పుకోలేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి. 2010లో కెన్యా వ్యాపారవేత్త అలీ పుంజానీని కిమ్ పెళ్లి చేసుకున్నారు. ఆయనతో కూడా విడిపోయిన కిమ్.. తెలుగు నటుడు హర్షవర్దన్ రానేతో డేటింగ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. కిమ్ తెలుగు అభిమానులకు సుపరిచితమే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. మరోవైపు నాలుగేళ్ల కిందట హాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను యువీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

2019 జూన్ 10న రిటైర్మెంట్:
2019 జూన్ 10న యువరాజ్ సింగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా.. ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. యువీ క్యాన్సర్‌పై విజయం సాధించి అందరికీ ప్రేరణగా నిలిచాడు. అదే మహమ్మారితో బాధపడుతున్న చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తున్నాడు. యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.


Click it and Unblock the Notifications

సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐపీఎల్ 2020?!!