
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ను వచ్చే సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించాలనుకుంటున్నట్టు ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా టోర్నీని వాయిదా వేయడం ఖాయమన్న అభిప్రాయాల నేపథ్యంలో.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే టోర్నమెంట్‌పై జులైలో నిర్ణయం తీసుకోవాలని బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఐసీసీ నిర్ణయించింది.
దీంతో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించాక అందుకోసం ప్రణాళికలు రచిస్తామని బ్రిజేశ్ పటేల్ గురువారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 'ఐపీఎల్ నిర్వహించేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. అయితే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించాకే ఐపీఎల్ కోసం ప్రణాళిక రచించడం ప్రారంభిస్తాం. విశ్వటోర్నీపై ఐసీసీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. మేం మాత్రం సెప్టెంబర్-అక్టోబర్ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని అనుకుంటున్నాం' అని బ్రిజేశ్ పటేల్ తెలిపాడు. విదేశాల్లో టోర్నీ నిర్వహించే అంశంపై ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా లేఖ ద్వారా చెప్పాడు. 'కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్ 2020 నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. అన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డులు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ను నిర్వహిస్తాం. అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. లీగ్ ఆడటానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అభిమానులు, ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లు, ప్రసారదారులు, స్పాన్సర్లు ఈ సంవత్సరం ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు' అని బోర్డు సభ్యులకు లేఖ రాశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ని ఐసీసీ వాయిదా వేయాలని చూస్తుంది.