
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ విధ్వంసకర ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. పరుగులను కట్టడి చేసే క్రమంలో ప్రసిధ్.. ధాటిగా ఆడే ప్రయత్నంలో ఉన్న పొలార్డ్ మధ్య కొద్దిపాటి మాటల యుద్దం నడిచింది. అయితే ఈ ఫైట్‌లో సీనియర్ ప్లేయర్ పొలార్డ్‌దే పై చేయి అయింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ ఆఖరి బంతిని ప్రసిధ్.. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. పొలార్డ్ డిఫెన్స్ చేశాడు. బంతి కాస్త ప్రసిధ్ వైపు రావడంతో అతను పొలార్డ్‌వైపు విసిరికొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి బంతికి చిక్కలేదు. అయితే యువ ఆటగాడి చర్య పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన పొలార్డ్.. ప్రసిధ్‌పై నోరుపారేసుకున్నాడు. తదుపరి ఓవర్‌లో నీ సంగతి చూస్తా అన్నట్లు ప్రసిధ్ వైపు ఓ లుక్ ఇచ్చాడు. ఇక ప్రసిధ్ సైతం నువ్వెంతా అన్నట్లు పొలార్డ్‌ను పట్టించుకోలేదు.
అయితే 18వ ఓవర్‌లో బంతిని అందుకున్న ప్రసిధ్‌కు పొలార్డ్ తన సత్తా ఏంటో చూపించాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాది యువపేసర్‌ను భయపెట్టాడు. ఇక పొలార్డ్ ధాటికి వణికిపోయిన ప్రసిధ్.. అతన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వైడ్ యార్కర్లు వేసే ప్రయత్నం చేశాడు. కానీ పొలార్డ్ ఉన్నాడనే భయమో లేక.. ఒత్తిడో తెలియదు కానీ మనోడు వరుసగా మూడు వైడ్లు, ఒక నోబాల్ వేసాడు. చివరకు పొలార్డ్‌కు భారీ షాట్లు ఇవ్వకుండానే ఓవర్‌ను ముగించాడు. అయితే పొలార్డ్- ప్రసిధ్ మధ్య జరిగిన ఈ సంఘటనకు అభిమానులు ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తున్నారు. వారి లిప్ మూమెంట్‌ను అనుసరిస్తూ తమకు తోసిన డైలాగ్స్ కూడా రాస్తున్నారు. 'బచ్చాగాడివీ.. నాకే దమ్మీ ఇస్తావా? తర్వాతి ఓవర్‌లో నీ సంగతి చూస్తా బిడ్డా!'అని పొలార్డ్ ప్రసిధ్ హెచ్చరించినట్లు.. పొపోవోయ్.. అని ప్రసిధ్ బదులిచ్చినట్లు క్యాప్షన్స్ ఇస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్‌సెంచరీతో రాణించాడు.ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత చేజింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) చెలరేగారు. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలకు కాకుండా రోహిత్ శర్మ వికెట్ తీసిన స్పిన్నర్ సునీల్ నరైన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'అవార్డు దక్కడం విశేషం.