
దుబాయ్: క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయాన్నందుకుంది. డబుల్ సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో 6వ స్థానంలోకి వచ్చి ప్లే ఆఫ్ ఆశలను రెకెత్తించింది. అయితే తొలిసూపర్ ఓవర్‌లో సులువుగా గెలిపించలేకపోయాననే బాధతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌కు డుమ్మా కొట్టాడు.
రోహిత్ శర్మ బాధలో ఉన్నాడని అందుకే తాను వచ్చానని పోలార్డ్ తెలిపాడు. ఇక తాత్కలిక సారథిగా తమ ఓటమిపై పొలార్డ్ స్పందించాడు. టీ20 క్రికెట్‌లో ఒక్కో పరుగు ఎంత విలువైందో ఈ మ్యాచ్ తెలియజేసిందన్నాడు. అభిమానులకు కావాల్సిన మజా లభించిందనుకుంటున్నానని, ఈ విజయానికి పంజాబ్ ఆటగాళ్లు పూర్తిగా అర్హులని కొనియాడాడు.
'టీ20 క్రికెట్‌లో సింగిల్స్, డబుల్స్ ఎంత కీలకమో ఈ మ్యాచ్ తెలియజేసింది. టీవీ ప్రేక్షకులకు కావాల్సిన మజా లభించిందని ఖచ్చితంగా చెప్పగలను. మా కంటే అద్భుతంగా ఆడిన పంజాబ్ ప్లేయర్స్ ఈ విజయానికి అర్హులు. 170 పరుగులు మంచి లక్ష్యం. స్లో వికెట్, పెద్ద మైదానం కారణంగా ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటామనుకున్నాం. కానీ కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వారందరికి నా అభినందనలు. ఇలాంటి ఫలితాలు సహజమే. క్రికెట్ అంటేనే ఇది. తప్పులును సవరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. పరిస్థితులతో సంబంధం లేకుంటే ఎవరికీ వారు తమ బాధ్యతను నిర్వర్తిస్తే ఈ మ్యాచ్ మేం గెలిచి ఉండేవాళ్లం.'అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.
తొలి సూపర్ ఓవర్‌లో పంజాబ్ 5 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ కూడా 5 పరుగులే చేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు ఉన్న రోహిత్ శర్మ జట్టుకు విజయాన్నందించలేకపోయాడు. సెకండ్ సూపర్ ఓవర్‌లో ముంబై 11 రన్స్ చేయగా..పంజాబ్, గేల్,మయాంక్ సూపర్ బ్యాటింగ్‌తో 4 బంతుల్లోనే విజయాన్నందుకుంది.