
దేవుడికి, అంకుల్‌కు ధన్యవాదాలు
కీలక ఇన్నింగ్స్ ఆడిన కీరన్ పొలార్డ్ (34 బంతుల్లో 87; 6 ఫోర్లు, 8 సిక్సర్లు)కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా పొలార్డ్ మాట్లాడుతూ... 'ఆ దేవుడికి, అంకుల్ స్టీవెన్‌కు ధన్యవాదాలు. వారు పైనుంచి చూస్తూ నాకు ధైర్యం, బలాన్నీ ఇచ్చారు. చెన్నై జట్టు మొయిన్ అలీ వికెట్ మాత్రమే కోల్పోవడంతో సీమర్లు బౌలింగ్ చేస్తే మంచిదనిపించింది. నేను రెండు వికెట్లు తీశాను. మరో ఓవర్‌ను అద్భుతంగా విసిరినందుకు సంతోషంగా ఉంది. ఇది చిన్న మైదానం. ఛేదనలో చెన్నై నాలుగు ఓవర్లు స్పిన్నర్లతో వేయించాల్సి ఉందని ముందే తెలుసు. అందుకే సిక్సర్లు బాదేస్తే ఆటను చివరి వరకు తీసుకెళ్లొచ్చని అనుకున్నా' అని అన్నాడు.

సిక్సర్లు బాదడం అలవాటైంది
'మైదానంలో ఎప్పుడూ భారీ షాట్లు సాధన చేస్తూనే ఉంటా. ఎంతో సాధన చేయడంతోనే సిక్సర్లు బాదడం అలవాటైంది. 360 డిగ్రీల్లో కొడతానని కాదు గానీ భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం నా అలవాటు. చివరి ఓవర్లో మాకు 16 రన్స్ కావాలి. ఆఖరి 6 బంతుల్ని నేనే ఆడాలనుకున్నా. మొత్తానికి విజయం సాధించాం. ఈ మైదానంలో మాకిది రెండో విజయం. సీజన్ మధ్య దశలో మేం బాగా ఆడతామని ధీమాగా ఉన్నాం. మరిన్ని విజయాలు సాధిస్తాం' అని కీరన్ పొలార్డ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచులో పొలార్డ్ ఏకంగా 8 సిక్సులు బాదాడు. అంతేకాదు ఈ సీజన్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా చేశాడు.
IPL 2021: బ్లూ జెర్సీలో బరిలోకి దిగనున్న బెంగళూరు.. అసలు కారణం అదే?

క్రీజులోకి వెళ్లి చితకబాదాలంతే
'ఇలాంటి మ్యాచుల్లో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు. పొలార్డ్ ఇలా ఆడినప్పుడు మాటలుండవు. కొన్నేళ్లుగా అతడీ పని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నాడు. పొలార్డ్ నిలకడగా ఆడటం అద్భుతం. ఈ మ్యాచును నేనే ముగించాలని భావించా. కానీ అలా జరగలేదు. ఏదేమైనా మ్యాచ్ గెలిచినందుకు సంతోషం. ఇలాంటి భారీ స్కోరు ఛేదించేటప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదు. క్రీజులోకి వెళ్లి చితకబాదాలంతే. టోర్నీలో సరైన సమయంలో మేం పుంజుకున్నాం. ఈ గెలుపు మా జోరును పెంచుతుందనడంలో సందేహం లేదు. పొలార్డ్‌ను చూసి గర్విస్తున్నాం. మరిన్ని విజయాలు అందుకుంటాం' అని ముంబై మరో హిట్టర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

చివరి ఓవర్లో 16 పరుగులు
ముంబై ఇండియన్స్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం అయ్యాయి. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి పరుగేమీ రాలేదు. రెండు, మూడో బంతికి కీరన్ పొలార్డ్ ఫోర్లు బాదాడు. నాలుగో బంతికి సింగల్ వచ్చే అవకాశం ఉన్నా.. పొలార్డ్ నిరాకరించాడు. ఇదో బంతికి సిక్స్ బాదిన విండీస్ హిట్టర్.. చివరి బంతికి డబుల్ తీసి ముంబైకి ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో ఐపీఎల్‌లో రెండో విజయవంతమైన భారీ ఛేదనగా ఈ మ్యాచ్ నిలిచింది. గతేడాది సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 224 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది అతి పెద్ద ఛేదన.


Click it and Unblock the Notifications
