
దుబాయ్: ఆరంభంలో దక్కిన శుభారంభాన్ని అందిపుచ్చుకోలేకపోయామని, చివర్లో దారళంగా పరుగులిచ్చి మూల్యం చెల్లించుకున్నామని ముంబై ఇండియన్స్ తాత్కలిక సారథి కీరన్ పొలార్డ్ అన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కూడా తమ ఓటమిని శాసించిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన తాత్కలిక సారథి పొలార్డ్.. తాము అనవసరంగా ఇచ్చిన పరుగులే తమ ఓటమిని ఖారారు చేసాయన్నాడు. టీ 20 క్రికెట్‌లో ఏ ఒక్కరు చెలరేగినా మ్యాచ్ స్వరూపం మారిపోతుందని, చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదే చేసి చూపించాడని ప్రశంసించాడు.
'రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక్కరు రాణించినా ప్రత్యర్థి జట్టు మూల్యం చెల్లించుకుంటుంది. బౌలింగ్‌లో మాకు దక్కిన ఆరంభాన్ని కొనసాగించలేకపోయాం. చివర్లో ధారళంగా పరుగులిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. మేం ఎక్స్‌ట్రాగా ఇచ్చిన రన్సే మా ఫలితాన్ని శాసించాయి. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించింది. బంతి స్వింగ్ అయింది. మా బౌలర్లు కూడా చెలరేగారు. కానీ ఆ జోరును మేం కొనసాగించలేకపోయాం. చెన్నై సూపర్ కింగ్స్ 150 ప్లస్ రన్స్ చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని చేధించే సత్తా మా జట్టుకు ఉంది. కానీ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం మా పాలిట శాపంగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సౌరభ్ తివారీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. విజయం కకోసం ఒంటరి పోరాటం చేశాడు.'అని పొలార్డ్ ప్రశంసించాడు.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్), డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్ చహర్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంకాగా. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.
అయితే 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై..100 పరుగులైన చేస్తుందా? అనిపించింది. కానీ ముంబై కెప్టెన్ చేసిన ఘోర తప్పిదమే చెన్నైకి కలిసొచ్చిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 'ముంబై మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. ప్రారంభంలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత శర్మ దూరమైనప్పటికీ.. ఆ ఒత్తిడిని జయించి శుభారంభం చేసింది. ముంబై బౌలర్ల ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి సీఎస్‌కే కీలక నాలుగు వికెట్లు కోల్పోవడంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగా అంబటి రాయుడు సేవలను కోల్పోయింది. ఇలా టాప్-5 బ్యాట్స్‌మన్ పెవిలియన్ చేరిన వేళ ఆ అవకాశాన్ని ముంబై అందిపుచ్చుకోలేకపోయింది. ముంబై తాత్కలిక సారథి కీరన్ పొలార్డ్ ఆ ట్రిక్‌ను మిస్సయ్యాడు. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్‌మన్‌పై మరింత ఒత్తిడి పెంచేలా జస్‌ప్రీత్ బుమ్రాతో 2-3 ఓవర్లు బౌలింగ్ చేయించాల్సింది. అలా చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా 40 లేదా 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఉండేది. 60, 70 లేదంటే 80 పరుగులకే ఆలౌటయ్యేది.'అని చెప్పుకొచ్చాడు.