
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఆసుపత్రి పాలయ్యాడు. అనారోగ్య కారణాలతో ఖలీల్ అహ్మద్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దాంతో అతను నేటి నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫికి దూరమయ్యాడు. తన అనారోగ్య పరిస్థితిని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న ఖలీల్ అహ్మద్.. క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందని తెలిపాడు.
'డియర్ ఆల్... క్రికెట్‌కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అయితే తప్పడం లేదు. నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, అందుకే రంజీ ట్రోఫీ సీజన్‌లో చాలా మ్యాచులకు దూరంగా ఉండబోతున్నా. అయితే నేను త్వరలోనే కోలుకుని, జట్టులోకి తిరిగి వస్తాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు. అయితే ఏ సమస్యలతో ఖలీల్ ఆసుపత్రిపాలయ్యాడనే విషయం తెలియరాలేదు.
జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత అతని ప్లేస్‌ను భర్తీ చేయగల ఆటగాడు ఖలీల్ అహ్మద్ అని భావించినా.. అతను ఆకట్టుకోలేకపోయాడు.
2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్, టీమిండియా తరుపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 15, టీ20ల్లో 13 వికెట్లు తీసిన ఖలీల్ అహ్మద్, ధారాళంగా పరుగులు సమర్పించి తక్కువ సమయంలోనే టీమ్‌లో చోటు కోల్పోయాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఖలీల్ అహ్మద్.. గాయాలతో జట్టుకి పూర్తిగా అందుబాటులో ఉండలేకపోయాడు.
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన పేసర్ ఖలీల్ అహ్మద్ కోసం ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టు హోరాహోరీగా పోటీపడ్డాయి. దాంతో అతను రూ.5.25 కోట్ల భారీ ధర పలికాడు.