న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను వదులుకొని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఘోర తప్పిదం చేసిందని ఆ జట్టు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్స్ అన్నాడు. ఈ సీజన్‌లో చాహల్ గనుక ఆర్‌సీబీలో ఉండి ఉంటే ఆ జట్టు ఓడిన మ్యాచ్‌ల్లో సగం గెలిచేదని చెప్పాడు. అసలు చాహల్‌ను ఆర్‌సీబీ ఎందుకు వదులుకుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.
రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చెబుతూ పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్-ఆర్‌సీబీ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్ ప్రదర్శనను కొనియాడాడు. 'రాజస్థాన్ రాయల్స్ జట్టుకు యజ్వేంద్ర చాహల్ ఓ గొప్ప బహుమతిగా దొరికాడు.

ఐపీఎల్ చరిత్రలోనే ఇదో గొప్ప గిఫ్ట్. అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతన్ని ఎందుకు వదులుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతను నిలకడగా వికెట్లు తీస్తూనే ఉన్నాడు. యజ్వేంద్ర చాహల్ ఉండి ఉంటే.. ఈ సీజన్‌లో ఓడిపోయిన మ్యాచుల్లో ఆర్‌సీబీ సగం మ్యాచుల్లో అయినా గెలిచి ఉండేది. ఆర్‌సీబీలో చాహల్ చేసిన మ్యాజిక్ చూశాక అతన్ని పింక్ జెర్సీలో చూడడం కొంచెం కష్టంగానే ఉంది.'అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను మాత్రమే ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. మరో ప్లేయర్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకునే ఉద్దేశంతో ఎవర్నీ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో యుజ్వేంద్ర చాహల్ కోసం ఆర్‌సీబీ బిడ్ కూడా వేయలేదు.
అతనికి బదులు వానిందు హసరంగాపై రూ.10 కోట్ల రూపాలయను కుమ్మరించింది. కానీ అతని చాహల్‌లా మేటి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. రూ.6.5 కోట్లకే చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్ తీసుకోగా అతను అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక వికెట్ల పడగొట్టి పర్పుల్ క్యాచ్ అందుకున్నాడు. తాజా సీజన్‌లోనూ 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. మార్క్‌వుడ్‌తో పర్పుల్ క్యాప్ కోసం పోటీపడుతున్నాడు. ఈ క్రమంలోనే చాహల్‌ను వదిలేసి ఆర్‌సీబీ ఘోర తప్పిదం చేసిందన్నాడు.