
లండన్: భారత జట్టుకు సారథ్యం వహించడం చాలా కష్టమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చుట్టు జరుగుతున్న చర్చను ఉద్దేశించిన ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్ ఓటమి అనంతరం కోహ్లీ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అతన్ని సారథ్యం నుంచి తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. కోహ్లీ సారథ్యంలో భారత్ వరుసగా గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైంది. అదే సమయంలో అజింక్యా రహానే సారథ్యంలో.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలుపొందడంతో కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయితే పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు.
'పరిస్థితులు మారాలని నేనేం కోరుకోవడం లేదు. కానీ, టీమిండియా టెస్టు కెప్టెన్సీ చుట్టూ జరిగే చర్చను విస్మరించడం అసాధ్యమని చెప్పాలి. కోహ్లీ ఇప్పటికే నాలుగు టెస్టులు ఓడిపోయాడు. అదే సమయంలో రహానే ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాడు. దీంతో సామాజిక మాధ్యమాలు, టీవీ, రేడియో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. భారత్‌కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. దురదృష్టం కొద్దీ ఇలాంటివి చోటుచేసుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీకి ఇంకో ఓటమి అవసరం లేదు. అయితే, రెండో టెస్టులో టీమిండియాకు విజయం అందించే సత్తా అతనికుంది' అని ఓ వెబ్‌సైట్‌కు రాసిన బ్లాగ్‌లో పీటర్సన్ పేర్కొన్నాడు.
కాగా, గతేడాది ఫిబ్రవరిలో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు ఓడిన సంగతి తెలిసిందే. ఆపై ఆస్ట్రేలియాలో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఓటమి చవిచూసింది. కోహ్లీ గైర్హాజరీలో రహనే జట్టుకు చారిత్రాత్మక విజయాన్నందించడంతో అతనికి జట్టు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత సిరీస్ కోహ్లీ కెప్టెన్సీకి అగ్ని పరీక్షగా మారింది. శనివారం నుంచి సెకండ్ టెస్ట్ ప్రారంభం కానుండగా.. గెలుపే లక్ష్యంగా భారత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.