
లండన్: ఛేజింగ్ కింగ్‌గా ఖ్యాతిగాంచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సరితూగలేడని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కన్నా కోహ్లీనే బెస్ట్ అని కొనియాడాడు. లక్ష్య ఛేదనలో కోహ్లీ నెలకొల్పిన అసాధారణ రికార్డులే దీనికి నిదర్శనమని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ పోమీ ఎంబాగ్వాతో శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన పీటర్సన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'అత్యంత ఒత్తిడి అనుభవిస్తూ ఛేదనలో భారత్‌ను తరచుగా గెలిపించే కోహ్లీ రికార్డు ముందు స్మిత్ దిగదుడుపే. స్మిత్ అతని దరిదాపుల్లోకి కూడా రాలేడు. మ్యాచ్ ఛేదనలో విరాట్ సగటు 80. అతని వన్డే సెంచరీలన్నీ ఛేజింగ్‌లో వచ్చినవే. దీన్ని బట్టి చూస్తే నా దృష్టిలో సచిన్ కన్నా కూడా విరాటే ఉత్తమం. వ్యక్తిగత ప్రదర్శనల కన్నా దేశాన్ని గెలిపించడమే ముఖ్యం.
నన్ను కూడా ఈ భావమే నడిపించేది. ఎన్ని 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు అందుకున్నామన్నది కాదు ఇంగ్లండ్‌ను ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిపించామన్నదే నాకు ముఖ్యం. భారత్ కోసం కోహ్లీ కూడా ఇదే చేస్తున్నాడు. అతనో అసాధారణ క్రికెటర్' అని పీటర్సన్ కొనియాడాడు. క్రికెట్ మూడు ఫార్మాట్‌లలో విరాట్ 50కి పైగా సగటును కలిగి ఉండగా... స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 62.74, వన్డేల్లో 42.46, టి20ల్లో 29.60 సగటుతో ఉన్నాడు.
ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంప్రదాయక ఫార్మాట్‌లో స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో విరాట్, రోహిత్ తొలి రెండు స్థానాలు కైవసం చేసుకోగా స్మిత్ కనీసం టాప్-10లో కూడా లేడు. టీ20ల్లో బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. కోహ్లీ, కేఎల్ రాహుల్ టాప్10లో ఉన్నారు. స్మిత్ 52వ స్థానంలో నిలిచాడు.