కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్యా రహానేపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమర్శలకు ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదని, ఆటతోనే బదులివ్వవచ్చని చురకలు అంటించాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బిగ్ బీ అమితా బచ్చన్ వంటి వాళ్లే విమర్శలకు వారి పనితీరుతో సమాధానమిచ్చారని గుర్తు చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడంతో కెప్టెన్ రహానేపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అతని స్ట్రైక్‌రేట్ లేదని కొందరు విశ్లేషకులు మండిపడ్డారు. అయితే ఈ విమర్శలపై రహానే ఘాటుగా స్పందించాడు. ఏదో ఎజెండాతో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బదులిచ్చాడు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్‌తో పరాజయం అనంతరం కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం అడగ్గా.. క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అజింక్యా రహానే శైలిని తప్పుబట్టిన సెహ్వాగ్.. తనదైన శైలిలో మందలించాడు.

'ఆటగాళ్లు ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. అజింక్యా రహానె కెప్టెన్ కాబట్టి.. కామెరూన్ గ్రీన్ గురించి అడిగారు. అతని దగ్గర సమాధానం లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాను అడగమని చెప్పాడు. ఆట విషయంలో విమర్శలు, పొగడ్తలు రెండూ వస్తాయి. అన్నింటికి తటస్థంగా ఉండాలి. ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ వంటి వారు తమపై వచ్చిన విమర్శలను హుందాగా ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో వారు మౌనంగా ఉంటూ పనితీరుతోనే బదులిచ్చారు.
ఇక సచిన్ పాజీ అయితే ఆటగాళ్లందరికి ఈ విషయంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ఒకానొక సమయంలో టెండూల్కర్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఒక వార్తాపత్రిక 'ఎండూల్కర్' అనే హెడ్డింగ్‌తో ఆర్టికల్ రాసింది. కానీ సచిన్ పాజీ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. కాబట్టి.. ఆటగాళ్లు విమర్శలకు స్పందించకుండా మౌనంగా ముందుకు వెళ్లడమే మంచిదని నా అభిప్రాయం. రహానే ఒక సెంచరీ చేస్తే.. అందరి నోర్లు మూతపడతాయి. అన్నింటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు' అని సెహ్వాగ్ చరుకలంటించాడు.