ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ వ్యూహాలను సిద్దం చేస్తోంది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన 8 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రధాన ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకుంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే మినీ వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా టీమ్ బలహీనతలను అధిగమించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 8 మంది ఆటగాళ్లను వదిలేయడం ద్వారా సమకూరిన రూ.25.50 కోట్ల పర్స్ మనీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలం బరిలోకి దిగుతోంది. మిగతా జట్లతో పోల్చితే ఆరెంజ్ ఆర్మీ వద్ద మంచి డబ్బే ఉంది.
అప్‌కమింగ్ సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్.. మంచి పవర్ హిట్టర్‌తో లోయరార్డర్‌ను బలోపేతం చేసుకోవాలని అనుకుంటుంది. అంతేకాకుండా ఇండియన్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో పాటు మహమ్మద్ షమీ స్థానాన్ని భారత పేసర్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధానంగా ఓ నలుగురి ఆటగాళ్లపై ఫోకస్ పెట్టింది.

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను కొనుగోలు చేసేందుకు కావ్య మారన్ ప్రయత్నించవచ్చు. రస్సెల్‌ను తీసుకోవడం జట్టుకు మంచి బ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయడం రస్సెల్ ప్రత్యేకత. తనదైన రోజున ఒంటి చేతితో రస్సెల్ మ్యాచ్‌ను గెలిపించగలడు. కాకపోతే రస్సెల్ గత కొన్ని సీజన్లుగా మెరుగైన ప్రదర్శన చేయలేదు. దాంతోనే సుదీర్ఘ కాలం తమ జట్టుకు ఆడిన రస్సెల్‌ను కేకేఆర్ వేలంలోకి వదిలేసింది.
పైగా అతని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. రస్సెల్‌కు బ్యాకప్‌గా కామెరూన్ గ్రీన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, లియామ్ లివింగ్ స్టోన్‌లను ఆరెంజ్ ఆర్మీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు. ప్రధానం కామెరూన్ గ్రీన్‌తో పాటు రస్సెల్‌పై కావ్య మారన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయత్నించనుంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై ఆరెంజ్ ఆర్మీ కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన ఈ యువ భారత లెగ్ స్పిన్నర్‌కు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. రవి బిష్ణోయ్ వేలంలో చిక్కపోతే.. మరో భారత అనామక స్పిన్నర్‌ను ఆరెంజ్ ఆర్మీ తీసుకునే ఛాన్స్ ఉంది.
మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. వేలంలో భారత పేసర్‌పై ఫోకస్ పెట్టనుంది. టీమిండియా స్టార్ పేసర్ ఆకాశ్ దీప్‌తో పాటు అనామక ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్‌ను తీసుకునేందుకు ఆరెంజ్ ఆర్మీ ప్రయత్నించవచ్చు. తొలి ఆప్షన్ ఆకాశ్ దీప్ కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది. అతను చిక్కకపోతే ఆకాశ్ మధ్వాల్‌ను తీసుకోవచ్చు. ఓవర్‌సీస్ స్లాట్స్ రెండు మాత్రమే ఖాళీగా ఉండటంతో సన్‌రైజర్స్ భారత ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆకాశ్ మధ్వాల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు.